ఆల్కహాల్ అనుకుని శానిటైజర్ తాగాడు..చనిపోయాడు

ఆల్కహాల్ అనుకుని శానిటైజర్ తాగాడు..చనిపోయాడు

కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా శానిజైర్ తో చేతులు బాగా శుభ్రం చేసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో అన్ని వర్గాల వారు శానిటైజర్ ను యూజ్ చేస్తున్నారు. హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు. అయితే ఓ ఖైదీ మాత్రం శానిటైజర్ ను ఆల్కహాల్ అనుకుని తాగేశాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ(శుక్రవారం) చనిపోయాడు. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్ లో జరిగింది.

రామ‌న్ కుట్టి అనే వ్య‌క్తి ఫిబ్ర‌వ‌రి 18 నుంచి రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నాడు. ఈ క్ర‌మంలో గురువారం రామ‌న్ కుట్టి క‌ళ్లు తిరిగి ప‌డిపోవ‌డంతో జైలు అధికారులు అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ సూచ‌న‌లతో జైలులో ఖైదీలతో శానిటైజ‌ర్ తయారు చేయిస్తారు. ఇందులో భాగంగానే గ‌త గురువారం రామ‌న్ కుట్టి ఆల్క‌హాల్ అనుకొని శానిటైజ‌ర్ తాగుంటాడని జైలు అధికారులు అనుకుంటున్నారు. అయితే మంగ‌ళ‌వారం రాత్రి వ‌ర‌కు అత‌ని ఆరోగ్యం సాధార‌ణ స్థితిలోనే ఉంద‌ని, బుధ‌వారం రోల్ కాల్ కోసం కూడా హాజ‌ర‌య్యాడ‌ని తెలిపారు.

అయితే గురువారం ఉద‌యం 10 గంట‌ల స‌మ‌యంలో క‌ళ్లు తిరిగి ప‌డిపోవ‌డంతో వెంట‌నే రామన్ కుట్టీని ఆస్పత్రిలో చేర్పించిన‌ట్లు తెలిపారు. శుక్ర‌వారం చికిత్స పొందుతూ చనిపోయినట్లు చెప్పారు. ఈ విష‌యంపై కేసు న‌మోదు చేసిన పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వ‌హించిన తర్వాత  ఖైదీ చనిపోవడానికి గల కార‌ణాలు చెబుతామన్నారు.