ఖైదీల తరలింపు.. రెండేళ్లలో మోడర్న్ జైలు నిర్మాణం

ఖైదీల తరలింపు.. రెండేళ్లలో మోడర్న్ జైలు నిర్మాణం

వరంగల్ అర్బన్: రాష్ట్ర కేబినెట్ నిర్ణయం మేరకు వరంగల్ సెంట్రల్ జైలును ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి అప్పగిస్తున్నామని జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది అన్నారు. ఇందులో భాగంగా ఖైదీలను వివిధ జైళ్లకు తరలిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ రోజు మొత్తంగా 119 మంది ఖైదీలను తరలిస్తున్నామని.. వీరిలో 80 మంది పురుషులు, 39 మంది మహిళా ఖైదీలు ఉన్నారని తెలిపారు. ఈ జైళ్లో ఉత్పత్తయ్యే వస్తువులు, చేనేత వస్త్రాలను కూడా ఇతర జైళ్లకు తరలిస్తున్నామని చెప్పారు. 

‘వరంగల్ సెంట్రల్ జైలును 1885వ సంవత్సరంలో నిర్మించారు. ప్రస్తుతం ఈ జైలులో 956 మంది ఖైదీలు, 2,667 మంది సిబ్బంది ఉన్నారు. ఖైదీలను వివిధ జైళ్లకు తరలిస్తున్నాం. త్వరలో వరంగల్ సెంట్రల్ జైలును వేరొకచోట మోడ్రన్ జైల్‌‌గా నిర్మిస్తాం. 15 రోజుల్లోగా ఖైదీల తరలింపు ప్రక్రియను పూర్తి చేస్తాం. ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి వారికి నచ్చిన చోటుకు బదిలీ చేస్తాం. రిమాండ్ ఖైదీలను తరలించాలంటే కోర్టు అనుమతి కావాలి. వారిని దగ్గర్లో ఉన్న జైళ్లలోకి తరలిస్తాం. కొత్త జైలు నిర్మాణం కోసం మామునూరు వద్ద ప్రభుత్వం 120 ఎకరాలు కేటాయించింది. భూ సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. రెండేళ్లలోగా ఆధునిక టెక్నాలజీతో కొత్త జైలును మోడర్న్ జైలుగా నిర్మాణం చేపడతాం. ఒకేసారి ఎంజీఎం మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, సెంట్రల్ జైల్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుంది’ అని రాజీవ్ త్రివేది పేర్కొన్నారు.