ఉత్తరప్రదేశ్ లో నీట మునిగిన జైలు.. ఖైదీల తరలింపు

ఉత్తరప్రదేశ్ లో నీట మునిగిన జైలు.. ఖైదీల తరలింపు

ఉత్తర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీరు ఇళ్లలోకి  వచ్చి చేరడంతో జనం నానా పాట్లు పడుతున్నారు. ఉండటానికి వీళ్లేకుండా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.

లోతట్టు ప్రాంతాలతో పాటు… బల్లియా జైలులోని బారక్స్‌లోకి కూడా వరదనీరు చేరింది. దీంతో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. జైలు మొత్తం జలమయం కావడంతో  సుమారు 500 మంది ఖైదీలను అజంగఢ్ జైలుకు తరలించారు. మరి కొందరిని మవు, అంబేద్కర్ జైలుకు తరలించినట్టు అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ రామ్ ఆశ్రాయ్ తెలిపారు.

యూపీలో అనేక ప్రాంతాల్లో సాధారణ వర్షపాతానికి మించి రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. దీంతో రాష్ట్రంలోని తూర్పు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా ఏడుకు పైగా రైళ్లను అధికారులు రద్దు చేయగా, ఐదు రైళ్లను దారి మళ్లించినట్టు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.