 
                                    - లేకపోతే వచ్చే నెల 3 నుంచి సమ్మె చేస్తామని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయిబర్స్ మెంట్ బకాయిలు ఇచ్చిన తర్వాతే ప్రైవేటు కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలు చేయాలని ప్రభుత్వాన్ని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూషన్స్ (ఫతీ) కోరింది. బకాయిలు ఇవ్వాలని కోరితే ఇలా తనిఖీల పేరుతో బెదిరించడం సరికాదని పేర్కొంది. గురువారం ఫతీ కోర్ కమిటీ అత్యవసర సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించారు.
ప్రైవేటు కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలు చేయాలని సర్కారు జారీ చేసిన ఉత్తర్వులపై చర్చించారు. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని కమిటీ నేతలు తప్పుపట్టారు. రూ.9 వేల కోట్ల ఫీజు బకాయిల్లో దీపావళి నాటికి రూ.1200 కోట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ.. ఇప్పటివరకూ 300 కోట్లు మాత్రమే ఇచ్చిందని నేతలు వెల్లడించారు. అధికారులు, మంత్రులతో పలుమార్లు జరిపిన చర్చల అనంతరం ప్రభుత్వం ఇచ్చిన హామీని కూడా నెరవేర్చకుండా.. విజిలెన్స్ తనిఖీలు చేయడం సరికాదన్నారు.
బకాయిలు చెల్లించాలని అడిగితే విజిలెన్స్ తనిఖీలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. బకాయిలు రిలీజ్ చేయకపోతే నవంబర్ 3 నుంచి సమ్మెలోకి పోతామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కాలేజీ సిబ్బంది కూడా సమ్మెలోనే ఉంటారని.. దీంతో విజిలెన్స్ తనిఖీలకు తాము సహకరించే పరిస్థితి లేదని వెల్లడించారు. కాగా, శుక్రవారం సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎంఓ సెక్రటరీ అజిత్ రెడ్డిని కలవాలని నిర్ణయించారు. విజిలెన్స్ తనిఖీలు ఆపాలని కోరనున్నారు.

 
         
                     
                     
                    