- కొన్నింటిపై టెంపరరీ, మరి కొన్నింటిపై పర్మనెంట్ బ్యాన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో 20 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. అమెరికా జాతీయ భద్రత, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ చర్యలు తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. 20 దేశాలతో పాటు పాలస్తీనా అథారిటీపై కూడా ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడించారు. అంగోలా, ఆంటిగ్వా, బార్బుడా, బెనిన్, కోట్ డిఐవోయిర్, డొమినికా, గాబన్, ది గాంబియా, మలావి, మౌరిటానియా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోంగా, జాంబియా, జింబాబ్వే దేశాలపై పాక్షిక ప్రయాణ పరిమితులను విధించారు.
బుర్కినా ఫాసో, మాలి, నైజర్, సౌత్ సూడాన్, సిరియా దేశాలపై పూర్తి స్థాయిలో బ్యాన్ పెట్టారు. అలాగే, పాలస్తీనా అథారిటీ జారీ చేసిన ట్రావెల్ డాక్యుమెంట్ ఉన్న దేశాల ప్రజలు అమెరికాకు రాకుండా పూర్తి బ్యాన్ విధిస్తున్నట్లు ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కొత్త నిబంధనలు జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయని వెల్లడించారు.
ఆయా దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు, అవినీతి ఎక్కువగా ఉండటం, నకిలీ పౌర డాక్యుమెంట్లు, క్రిమినల్ హిస్టరీని తనిఖీ చేసే వ్యవస్థ లేకపోవడం తదితర అంశాలను ట్రంప్ తన ప్రకటనలో ప్రస్తావించారు. అలాగే, వీసా గడువు ముగిసినా ఆయా దేశాల ప్రజలు అమెరికాలోనే ఉండిపోవడం, అలాంటి వారిని సొంత దేశాలకు తీసుకెళ్లేందుకు ఆయా దేశాలు ముందుకు రాకపోవడం కూడా
ఈ చర్యలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు.
