
- ఇంటర్ బోర్డు ఆదేశాలను బేఖాతర్ చేస్తున్న మేనేజ్మెంట్లు
- మిమ్స్ కాలేజీలో స్టూడెంట్ మృతితో వెలుగులోకి అక్రమాలు
- ఇంటర్‌కు డిగ్రీ లింక్ పెట్టి సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధింపులు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. పర్మిషన్లు లేకుండా కాలేజీలు, హాస్టళ్లు నడపొద్దనే నిబంధనను బేఖాతర్ చేస్తున్నాయి. ఇంటర్ బోర్డు పర్మిషన్లు లేకుండా ఐఐటీ, నీట్ అకాడమీలు, హాస్టళ్లు నిర్వహిస్తూ వేలాది రూపాయల ఫీజులు గుంజుతున్నాయి. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులపై కనీస పర్యవేక్షణ లేకపోవడంతో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇంటర్ అడ్మిషన్లకు డిగ్రీని లింకు పెట్టి ఇంటర్ తర్వాత వేరే కాలేజీకి వెళ్తే సర్టిఫికెట్లు ఇవ్వకుండా సతాయిస్తున్నాయి. ఒకవేళ సర్టిఫికెట్లు కావాలంటే చదవని డిగ్రీకి ఫీజులు చెల్లించాలని వేధిస్తున్నాయి. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో బాధితులు ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని పరిస్థితులు నెలకొన్నాయి.
పర్మిషన్ లేకుండానే మిమ్స్‌లో అడ్మిషన్లు
మంచిర్యాల బైపాస్ రోడ్‌లోని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర మిమ్స్ ఐఐటీ, నీట్ అకాడమీ పేరుతో ఈ ఏడాది జూనియర్ కాలేజీని ప్రారంభించారు. పర్మిషన్ కోసం ఇంటర్ బోర్డుకు అప్లై చేసుకున్నప్పటికీ అనుమతి రాలేదు. లోకల్ షిఫ్టింగ్, కాలేజీ నేమ్ ఛేంజ్, ఫైర్ సేఫ్టీ పెండింగ్ ఉండడంతో కాలేజీకి పర్మిషన్ రాలేదని డీఐఈవో అంజయ్య తెలిపారు. అయినప్పటికీ ఇంటర్ అడ్మిషన్లు తీసుకున్నారు. ఒకే బిల్డింగ్‌లో హాస్టల్, క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ విషయమై కాలేజీ యాజమాన్యానికి రెండుసార్లు నోటీసులు జారీ చేశామని, ఇంటర్ బోర్డు దృష్టికి కూడా తీసుకువెళ్లామని డీఐఈవో చెప్పారు. అలాగే కాలేజీ బిల్డింగ్ ఐదు అంతస్తులు ఉండగా.. పై రెండు ఫ్లోర్లలో ఇంకా వర్క్ పూర్తి కాకుండానే హాస్టల్‌తో పాటు క్లాసులు రన్ చేస్తున్నారు.
థర్డ్ ఫ్లోర్ నుంచి పడి సహస్ర మృతి
మిమ్స్ ఐఐటీ, నీట్ అకాడమీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న కొత్తపల్లి సహస్ర(18) మంగళవారం సాయంత్రం కాలేజీ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్ నుంచి పడి చనిపోయింది. లక్సెట్టిపేటకు చెందిన ఆమె ఈ ఏడాదే హాస్టల్లో జాయిన్ అయ్యింది. ఈ నెల 19న పెదనాన్న చనిపోవడంతో ఇంటికి వెళ్లింది. మంగళవారం మధ్యాహ్నం తండ్రి రమేశ్ సహస్రను హాస్టల్లో దింపివెళ్లాడు. ఆ తర్వాత ఐదారు గంటల్లోనే ఆమె థర్డ్ ఫ్లోర్ కిటికీ నుంచి కింద పడి ప్రాణాలు విడిచింది. సహస్ర సూసైడ్ చేసుకుందా, ప్రమాదవశాత్తు పడిపోయిందా అనేది పోలీసుల ఎంక్వయిరీలో తేలాల్సి ఉంది. కిటికీలకు గ్రిల్స్ లేకపోవడం వల్లే తమ కూతురు కింద పడి చనిపోయిందని, దీనికి మేనేజ్మెంట్ నిర్లక్ష్యమే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని బాలిక కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేశారు.
బుధవారం ఉదయం మంచిర్యాల జీజీహెచ్ ఎదుట సహస్ర డెడ్ బాడీతో ధర్నా నిర్వహించారు. నష్టపరిహారం చెల్లించేందుకు కాలేజీ యాజమాన్యం ఒప్పుకోవడంతో సాయంత్రం పోస్టుమార్టం అనంతరం డెడ్‌బాడీని తీసుకెళ్లారు. ఈ ఘటనతో మిగతా స్టూడెంట్స్, వారి పేరెంట్స్ భయపడుతున్నారు. అన్ని పర్మిషన్లు ఉన్నాయని కాలేజీ మేనేజ్మెంట్ మభ్యపెట్టి అడ్మిషన్లు తీసుకుందని, పర్మిషన్ రాకపోతే తమ పిల్లల భవిష్యత్ ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
ఇంటర్‌కు డిగ్రీ లింకు పెట్టి వేధింపులు
మంచిర్యాలలోని పలు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇంటర్‌కు డిగ్రీ లింకు పెట్టి అడ్మిషన్లు చేసుకుంటున్నాయి. తమ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసిన స్టూడెంట్లు డిగ్రీ కూడా అదే కాలేజీలో చదవాలని కమిట్మెంట్ తీసుకుంటున్నాయి. ఆ తర్వాత ఏదైనా కారణాలతో విద్యార్థులు వేరే కాలేజీకి వెళ్లాలనుకుంటే ఇంటర్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయి. లేదంటే డిగ్రీ ఫీజు కట్టాలని వేధిస్తున్నాయి.
బోర్డు తిప్పేసిన ప్రతిభ కాలేజీ..
మంచిర్యాలలోని ప్రతిభ జూనియర్ కాలేజీ యాజమాన్యం ఇటీవల బోర్డు తిప్పేసింది. కాలేజీ నిర్వాహకులు రూ.8 కోట్ల వరకు అప్పులు చేసి కాలేజీ బిల్డింగ్ అమ్ముకొని పరారయ్యారు. దీంతో ఆ కాలేజీ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరో కాలేజీలో జాయిన్ అవుదామంటే సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఎట్టకేలకు ఇంటర్ బోర్డు అధికారుల జోక్యంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. అందుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
మిమ్స్ కాలేజీకి పర్మిషన్ లేదు
మిమ్స్ ఐఐటీ, నీట్ అకాడమీకి ఇంటర్ బోర్డు నుంచి ఎలాంటి పర్మిషన్లు లేవు. లోకల్ షిఫ్టింగ్, నేమ్ చేంజ్, ఫైర్ సేఫ్టీ లేకపోవడంతో పర్మిషన్ రాలేదు. అనుమతి లేకుండా అడ్మిషన్లు చేసుకోవద్దని రెండు సార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు. అన్ని విషయాలను ఇంటర్ బోర్డు దృష్టికి తీసుకువెళ్లాము. ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
అంజయ్య, డీఐఈవో, మంచిర్యాల
అనుమతి లేని హాస్టల్స్ ను సీజ్ చేయాలి
మంచిర్యాల జిల్లావ్యాప్తంగా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేట్ హాస్టల్స్ నడుపుతున్నారు. విద్యార్థుల నుంచి వేలకు వేలు ఫీజులు తీసుకుంటున్నారు. వారి మంచిచెడ్డలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అనుమతి లేని హాస్టళ్లలో విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే సంబంధిత అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే మిమ్స్ హాస్టల్ తో పాటు ఇతర అనుమతి లేని ప్రైవేట్ హాస్టల్స్ ను అధికారులు సీజ్ చేయాలి.
పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్