ఎములాడ రాజన్న కోడెలతో ప్రైవేట్​ దందా!

ఎములాడ రాజన్న కోడెలతో ప్రైవేట్​ దందా!
  • ‘తెలంగాణ గోశాల ఫెడరేషన్’ ముసుగులో ప్రైవేట్ ​వ్యక్తులకు కేటాయింపు
  •     కోడెలను వాహనాల్లో కుక్కి తీసుకెళ్తున్నా పట్టించుకోని ఆఫీసర్లు 
  •     ఈనెల 2న మహబూబాబాద్​లోని సోమేశ్వర గో సంరక్షణ సంఘానికి ఆవులు
  •     తీరా అక్కడ గోసంరక్షణ కేంద్రం లేకపోవడంతో వాహనదారులపై కేసు పెట్టిన పోలీసులు
  •     కోడెలను కబేళాలకు తరలిస్తున్నారనే అనుమానాలు

వేములవాడ, వెలుగు : ఎములాడ రాజన్న సన్నిధిలో భక్తులు కట్టేసే కోడెలతో కొందరు వ్యాపారం చేస్తున్నారు.  ‘తెలంగాణ గోశాల ఫెడరేషన్’ పేరుతో లెటర్​తెచ్చుకుంటే చాలు, లక్షలు విలువజేసే కోడెలను ఆలయ అధికారులు ఫ్రీగా అప్పగిస్తున్నారు. ఇదే అదనుగా పలువురు అక్రమార్కులు గోశాలల ముసుగులో కోడెలను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. జంతుసంరక్షణ చట్టానికి వ్యతిరేకంగా ఒక్కో వాహనంలో 20కిపైగా కోడెలను కుక్కి తీసుకెళ్తుండడంతో వాటిని పెంపకం కోసం కాకుండా కబేళాలకు తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

తాజాగా ఈనెల 2న  తిప్పపూర్ లోని రాజన్న గోశాల నుంచి 20 కోడెలను మహబూబాబాద్  జిల్లాలోని శ్రీసోమేశ్వర గో సంరక్షణ సేవా సంఘానికి ఆలయ అధికారులు అప్పగించారు. పలువురి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ  వెహికిల్ ను పట్టుకొని విచారించగా, ​వాళ్లు చెప్పిన చోట గోశాలే లేదని తెలియడంతో కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత ‘తెలంగాణ గోశాల ఫెడరేషన్’ నిర్వాహకులతో పాటు ఆలయ ఆఫీసర్ల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గతేడాది 1866 కోడెల అప్పగింత

దేశంలో ఎక్కడాలేని విధంగా వేములవాడ రాజన్న సన్నిధిలో కోడె మొక్కు చెల్లింపుల  సంప్రదాయం కొనసాగుతోంది. భక్తులు సమర్పించిన కోడెలన్నింటినీ వేములవాడ పట్టణంలోని ఆలయ గోశాలల్లో ఉంచుతారు. వేలాదిగా వచ్చే కోడెలను సంరక్షించలేక గతంలో ఆయన అధికారులు వీటిని వేలం వేసేవారు. వేలంలో కోడెలను కొంటున్న వ్యాపారులు కబేళాలకు తరలిస్తుండడంతో కొన్నేళ్లుగా వేలం బంద్​పెట్టి, ‘తెలంగాణ గోశాల ఫెడరేషన్’ అనే సంస్థ  ద్వారా గోవులను సంరక్షించే గోశాలలకు ఉచితంగా అందజేస్తున్నారు. 

ఈ ఫెడరేషన్​ ఇచ్చే లెటర్​తో వచ్చేవారికి ఎలాంటి వెరిఫికేషన్​ లేకుండా కోడెలు అప్పగించడం వివాదాస్పదమవుతోంది. ఈ ముసుగులో పలువురు అక్రమార్కులు వాటిని బయట అమ్ముకుంటున్నారని, ముఖ్యంగా కబేళాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఈనెల 2న మహబూబాబాద్  జిల్లా తొర్రూరు మండలం దుబ్బా తండాలోని శ్రీసోమేశ్వర గో సంరక్షణ సేవా సంఘానికి ఆలయ అధికారులు 24 కోడెలను ఉచితంగా అప్పగించారు.  

‘తెలంగాణ గోశాల ఫెడరేషన్’ లెటర్​తో వచ్చినందున గుడ్డిగా తోలేశారు. 20 కోడెలు ఇవ్వాలని లెటర్​లో ఉన్నప్పటికీ మరో నాలుగు కలిపి అందజేశారు. ఈ 24 కోడెలను ఒకే వ్యానులో కుక్కి తీసుకెళ్తున్న క్రమంలో జనగామ జిల్లా స్టేషన్  ఘన్ పూర్ వద్ద బజరంగ దళ్  కార్యకర్తలు  అడ్డుకున్నారు. వాహనదారులు రాజన్న ఆలయ ఆఫీసర్లు ఇచ్చిన రసీదు చూపించగా,  అందులో కేవలం 20 కోడెలు అని ఉండగా.. వెహికల్ లో 24 ఉండడంతో  తొర్రూరు పీఎస్​లో కాంప్లెంట్​చేశారు. 

పోలీసులు ఆరా తీస్తే అసలు దుబ్బా తండాలో ఎలాంటి గోశాల లేదని తేలింది. దీంతో  వ్యాన్ ను సీజ్  చేసిన పోలీసులు ఆవులను తరలిస్తున్న సంతోష్, భాస్కర్, వ్యాన్  డ్రైవర్ రమేశ్ పై జంతు సంరక్షణ చట్టం కింద కేసు పెట్టారు.  కాగా, వేములవాడ రాజన్న గోశాలల నుంచి గడిచిన ఏడాది  1,866  కోడెలను,  28 ఆవులను తెలంగాణ గోశాల ఫేడరేషన్ (ఒక అర్గనైజేషన్) సూచించిన వాళ్లకు ఆలయ అధికారులు అప్పగించారు. ఇవన్నీ నిజంగానే గోశాలలకు వెళ్తున్నాయా? లేదంటే గోశాలల ముసుగులో బయట అమ్ముకుంటున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఎంతో విశ్వాసంతో కట్టేసే కోడెలను కేవలం ఒక ఫెడరేషన్ ను నమ్మి  ఎలా అప్పగిస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
 

ముగ్గురిపై కేసు పెట్టాం : సీఐ రాజు, స్టేషన్ ఘన్ పూర్ వేములవాడ రాజన్న ఆలయం నుంచి వ్యానులో 24 కోడెలు తరలిస్తున్నారని సమాచారం అందగా వ్యానును స్వాధీనం చేసుకున్నాం. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ సంఖ్యలో గోవులను తీసుకెళ్తుండడంతో ముగ్గురిపై జంతు సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశాం.  ఇంకా ఎంక్వరీ కొనసాగుతోంది. ఎండోమెంట్ ఉత్తర్వులు ఫాలో అవుతున్నాం : శ్రీనివాస్, ఏఈఓ, రాజన్న ఆలయం రాజన్న ఆలయ గోశాల నుంచి కోడెలను ఎవరికి ఇవ్వాలనేది మా చేతుల్లో లేదు. 

ఎండోమెంట్  ఉత్తర్వుల మేరకు తెలంగాణ గోశాల ఫెడరేషన్  వారు సూచించిన గోశాలలకు మాత్రమే గోవులను అప్పగిస్తున్నాం. మా దగ్గర నుంచి గోవులు వెళ్లాక వాటిని ఎక్కడికి తరలిస్తున్నారనేదానితో మాకు సంబంధం లేదు. నాలుగేళ్ల క్రితం నేరుగా ఆలయం నుంచే ఒక్కో రైతుకు రెండు కోడెలు ఇవ్వాలని ఆలయ కమిటీ తీర్మానం చేసి పంపినా ఇప్పటికీ అధికారులు అనుమతి ఇవ్వలేదు.