ప్రైవేట్ ఆస్పత్రుల్లో రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల కొరత

ప్రైవేట్ ఆస్పత్రుల్లో రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల కొరత

రాష్ట్రంలోని ప్రైవేట్​ హాస్పిటళ్లలో రెమ్డెసివిర్​ ఇంజెక్షన్ల కొరత తీవ్రంగా ఉంది. రెండు నెలల కింద కరోనా తగ్గడంతో కంపెనీలు ఉత్పత్తి తగ్గించాయి. సెకెండ్​ వేవ్​తో మళ్లీ కేసులు పెరిగి ఒక్కసారిగా ఈ డ్రగ్​కు డిమాండ్​ పెరిగింది. 

రాష్ట్రంలోని ప్రైవేట్ హాస్పిటళ్లలో  కరోనా ట్రీట్​మెంట్​కు వాడే రెమ్డెసివిర్ ఇంజెక్షన్లకు తీవ్ర కొరత ఉంది. వారం క్రితమే ఇండెంట్ పెట్టినా, హాస్పిటళ్లకు ఇంకా ఇంజెక్షన్లు రాలేదు. దీంతో పేషెంట్ల అటెండర్లనే ఇంజెక్షన్లు తెచ్చుకోవాలని మేనేజ్మెంట్లు ఆదేశిస్తున్నాయి. మొన్నటి వరకు ఇంజెక్షన్ రేటు రూ.వెయ్యి ఉండగా .. ఇప్పుడు బ్లాక్‌‌‌‌ మార్కెట్ లో రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు అమ్ముతున్నారు. దీంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. నెల రోజుల క్రితం వరకు ఈ డ్రగ్‌‌‌‌కు డిమాండ్ లేకపోవడంతో ఫార్మా కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయి. సెకండ్ వేవ్‌‌‌‌తో ఒక్కసారిగా కేసులు పెరగడంతో రెమ్ డెసివిర్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇంజక్షన్ల కొరత ప్రారంభమైంది. కరోనా ట్రీట్‌‌‌‌మెంట్ అందిస్తున్న కార్పొరేట్ హాస్పిటల్స్‌‌‌‌ నుంచి చిన్న హాస్పిటళ్ల వరకు ఈ ఇంజెక్షన్ లేక పేషెంట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంజెక్షన్లను ఏజెంట్లకు, మెడికల్ షాపులకు సప్లయ్ చేయొద్దని.. నేరుగా కరోనా ట్రీట్‌‌‌‌మెంట్ అందిస్తున్న హాస్పిటళ్లకే అమ్మాలని డ్రగ్‌‌‌‌ కంట్రోల్ అడ్మినిస్ర్టేషన్ రూల్ పెట్టింది. కానీ, ఈ నిబంధన పకడ్బందీగా అమలు కావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 

ఒక్కొక్కరికి 6 డోసులు

కరోనా ట్రీట్‌‌‌‌మెంట్ లో రెమ్ డెసివిర్ కీలకంగా మారింది. ఆక్సిజన్‌‌‌‌ అవసరమయ్యే పేషెంట్లకు కచ్చితంగా ఈ ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఒక్కో వ్యక్తికి రోజుకు ఒకటి చొప్పున 6 ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. కొంత మందికి అవసరాన్ని బట్టి 10 కూడా ఇవ్వొచ్చునని ఎయిమ్స్‌‌‌‌ సూచించింది. దీంతో ఇంజెక్షన్లు బయట కొనుగోలు చేసే పేషెంట్లకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు ఖర్చవుతోంది. కొన్ని దవాఖాన్లలో ఇంజెక్షన్లు లేక మధ్యలోనే కోర్సు ఆపేస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర డాక్టర్‌‌‌‌‌‌‌‌ రెడ్డీస్‌‌‌‌, హెటిరో, సిప్ల, మైలాన్ తదితర కంపెనీలు రెమ్ డెసివిర్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఇంజెక్షన్ల ఉత్పత్తి, స్టెరిలైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయి.. అవి బయటకు రావడానికి కనీసం 10 నుంచి 15 రోజుల టైమ్ పడుతుంది. ఇప్పటికే బయటకు వచ్చిన స్టాక్ పూర్తవ్వగా.. కొత్త స్టాక్ బయటకు రావడానికి మరో వారం నుంచి పది రోజుల సమయం పడుతుందని డీసీఏ అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు కొరత తప్పదంటున్నారు. 

అసలు అవసరమా? కాదా? 

ఓ వైపు రెమ్డెసివిర్ కు ఫుల్ డిమాండ్ ఉండగా.. మరోవైపు అది లైఫ్ సేవింగ్ డ్రగ్‌‌‌‌ ఏమీ కాదనే వాదనలూ వినిపిస్తున్నాయి. రెమ్డెసివిర్‌‌‌‌తో కరోనా పేషెంట్లకు లబ్ధి చేకూరుతున్నట్టు క్లినికల్‌‌‌‌గా ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఎయిమ్స్ ఇచ్చిన ట్రీట్‌‌‌‌మెంట్ గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌లో మాత్రం మోడరేట్, సీరియస్‌‌‌‌ డిసీజ్‌‌‌‌డ్ పేషెంట్లకు రెమ్డెసివిర్ ఇవ్వాలని పేర్కొంది. మన దగ్గర డాక్టర్లు కూడా రెమ్డెసివిర్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రెమ్డెసివిర్ అందరికీ అవసరం లేదని, హాస్పిటల్‌‌‌‌లో చేరిన ప్రతి ఒక్కరికీ ఇంజెక్షన్ ఇవ్వడం సరికాదని డీఎంఈ రమేశ్‌‌‌‌రెడ్డి అన్నారు. కొన్ని కేసుల్లో మాత్రమే ఈ ఇంజెక్షన్ అవసరం ఉంటుందన్నారు. రెమ్డెసివిర్‌‌‌‌తో పేషెంట్‌‌‌‌ కండీషన్‌‌‌‌లో పెద్దగా మార్పులేమీ రావడం లేదని గాంధీ హాస్పిటల్‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌ డాక్టర్ రాజారావు చెప్పారు. రెమ్డెసివిర్ పని చేయకపోతే ఇంత డిమాండ్ ఎందుకు ఏర్పడుతుందని అసోసియేట్‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ నరహరి అన్నారు. ఆ డ్రగ్‌‌‌‌ బాగానే పని చేస్తోందన్నారు. రెమ్డెసివిర్ డ్రగ్ ఇచ్చిన వాళ్లలో చాలా మంది రికవర్ అయ్యారని వుడ్‌‌‌‌లాండ్ హాస్పిటల్‌‌‌‌ హెడ్‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌ సురేశ్ రెడ్డి చెప్పారు. సీరియస్‌‌‌‌ స్టేజ్‌‌‌‌లోకి వెళ్లిన పేషెంట్లు కూడా కోలుకుంటున్నారని తెలిపారు. ఇక్కడి పేషెంట్లకే ఇంజెక్షన్లు, బెడ్లు కొరత ఉండగా.. కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్లు నాగ్‌‌‌‌పూర్ నుంచి పేషెంట్లను ఇక్కడికి తరలిస్తున్నాయని ఆయన ఆరోపించారు.