కరోనా పేషెంట్లతో ప్రైవేటు హాస్పిటళ్లు ఫుల్​

కరోనా పేషెంట్లతో ప్రైవేటు హాస్పిటళ్లు ఫుల్​
  • బెడ్లు సాల్తలే
  • సర్కారు దవాఖాన్లలోనూ నిండుతున్నయ్
  • రెమ్డెసివిర్​ ఇంజక్షన్ల​ కొరత
  • 2 లక్షల ఇంజక్షన్లకు ఆర్డర్ చేసిన టీఎస్‌‌ఎంఎస్‌‌ఐడీసీ
  • ఆక్సిజన్‌‌ కోసం ‘సెల్ఫ్ జనరేషన్’ మెషీన్లు

హైదరాబాద్, వెలుగు: కరోనా పేషెంట్లతో దవాఖాన్లు నిండిపోతున్నాయి. ఇన్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. పెద్ద హాస్పిటళ్లలో దాదాపు బెడ్లన్నీ  ఫుల్​ అయ్యాయి. పది రోజుల కిందటి నుంచే కార్పొరేట్ దవాఖాన్లు కిక్కిరిసిపోతుండగా ఇప్పుడు ప్రభుత్వ దవాఖాన్లలోనూ అదే పరిస్థితి నెలకొంది. గాంధీ హాస్పిటల్‌‌‌‌లో మూడొందల బెడ్ల ఐసీయూ ఉంటే, ప్రస్తుతం అందులో 221 మంది పేషెంట్లు ఉన్నారు. వీరిలో శుక్రవారం ఒక్క రోజే సుమారు 74  మంది అడ్మిట్ అయ్యారు. దీంతో ఇంకో రెండొందల బెడ్లను కరోనా పేషెంట్ల కోసం కేటాయించాలని ఆఫీసర్లు నిర్ణయించారు. నిజామాబాద్‌‌‌‌ జనరల్ హాస్పిటల్‌‌‌‌లోని ఐసీయూ పూర్తిగా పేషెంట్లతో నిండిపోయింది. కరోనా పేషెంట్ల కోసం కేటాయించిన రెండొందల బెడ్లు నిండడంతో, అదనంగా మరో యాభై బెడ్లు ఏర్పాటు చేస్తే అవి కూడా గురు, శుక్రవారాల్లో ఫుల్ అయ్యాయని అక్కడి డాక్టర్లు చెప్తున్నారు. ఇకపై పేషెంట్లను అడ్మిట్ చేసుకునే పరిస్థితి లేదని అంటున్నారు. హైదరాబాద్​లోని గచ్చిబౌలి టిమ్స్‌‌‌‌లో వారం కింద 255 మంది ఇన్‌‌‌‌పేషెంట్లు ఉండగా, శుక్రవారం నాటికి ఆ సంఖ్య 373కు చేరింది. వరంగల్‌‌‌‌ ఎంజీఎంలో శుక్రవారం ఒక్కరోజే  32 మంది కరోనా పేషెంట్లు అడ్మిట్ అయ్యారు. గడిచిన రెండ్రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,650 మంది పేషెంట్లు ప్రైవేట్‌‌‌‌ హాస్పిటళ్లలో అడ్మిటయ్యారు. కొన్ని హాస్పిటళ్లలో వెయిటింగ్ లిస్ట్‌‌‌‌  కూడా నడుస్తోంది.

కరోనా కేసులు పెరిగినట్టే సివియర్ పేషెంట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ప్రస్తుతం 1,522 మంది వెంటిలేటర్‌‌‌‌పై, 2,857 మంది ఆక్సిజన్‌‌పై ఉన్నారు. వాస్తవ లెక్క ఇంతకు ఎక్కువే ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. సివియర్  పేషెంట్లు పెరుగుతుండటంతో రెమ్డెసివిర్​ డ్రగ్ వాడకమూ పెరిగింది. కొన్ని హాస్పిటళ్లలో ఈ ఇంజక్షన్​ దొరకట్లేదు. దీంతో ఇంజక్షన్ తెచ్చుకోవాల్సిన బాధ్యతను పేషెంట్ల కుటుంబీకులకే అప్పగిస్తున్నారు. సిప్లా, మైలాన్‌‌, రెడ్డీస్ వంటి ఫార్మా కంపెనీలు మన దగ్గర ఈ డ్రగ్‌‌ను ఉత్పత్తి చేస్తుండగా.. మైలాన్ తప్ప మిగతా ల్యాబుల్లో ఉత్పత్తి తక్కువున్నట్టు  ఆఫీసర్లు చెప్తున్నారు. ముడిసరుకు కొరతతో సమస్య ఏర్పడిందంటున్నారు. ప్రభుత్వ దవాఖాన్ల  కోసం 2 లక్షల రెమ్డెసివిర్​ ఇంజక్షన్లకు టీఎస్‌‌ఎంఎస్‌‌ఐడీసీ ఆర్డర్‌‌‌‌ పెట్టింది. ఒక్కో ఇంజక్షన్‌‌ను జీఎస్టీతో కలిపి రూ. 884కు మైలాన్ కంపెనీ సప్లయ్​ చేస్తోంది.  హాస్పిటళ్లేమో రూ. 3 వేల వరకు చార్జ్‌‌ చేస్తున్నాయి.  
డాక్టర్లు, స్టాఫ్‌‌పై ప్రెజర్‌‌‌‌
కరోనా పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నకొద్దీ డాక్టర్లు, నర్సింగ్‌‌ స్టాఫ్​పై వర్క్​ లోడ్​  పెరుగుతోంది. పీహెచ్‌‌సీల నుంచి టీచింగ్ హాస్పిటళ్ల వరకూ ఇదే పరిస్థితి. టెస్టులు, వ్యాక్సినేషన్‌‌, ఔట్​ పేషెంట్ సర్వీస్‌‌, నాన్ కొవిడ్ ఐపీ, కొవిడ్ ఐపీతో దవాఖాన్ల స్టాఫ్   తీరిక లేకుండా పని చేయాల్సి వస్తోంది. ఇందుకోసం ప్రైవేట్‌‌ హాస్పిటళ్లలో టెంపరరీ సిబ్బందిని నియమించుకుంటున్నారు. ప్రభుత్వ దవాఖాన్లలోనూ స్టాఫ్‌‌ను పెంచాలని హెల్త్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ‘‘ప్రస్తుతం మా దగ్గర 380 మంది పేషెంట్లు ఉన్నారు. ఉన్న స్టాఫ్‌‌ ఈ పేషెంట్లను మేనేజ్ చేయడానికి సరిపోతారు. పేషెంట్ల సంఖ్య పెరిగి చాన్స్‌‌ ఉంది. అందుకే స్టాఫ్‌‌ను కూడా పెంచాలని గవర్నమెంట్‌‌కు లెటర్ రాశాం’’ అని టిమ్స్‌‌ సూపరింటెండెంట్‌‌  డాక్టర్​ ఇషాన్ అహ్మద్‌‌  చెప్పారు. నిజామాబాద్‌‌ జీజీహెచ్​లో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ షార్టేజ్ ఉందని, కొత్తగా రిక్రూట్‌‌ చేసుకోవాల్సిన అవసరం ఉందని అక్కడి సూపరింటెండెంట్‌‌ డాక్టర్ ప్రతిమ అన్నారు. టెంపరరీ స్టాఫ్‌‌ నియామకానికి ప్రభుత్వం ఓరల్ ఇన్‌‌స్ర్టక్షన్స్‌‌ ఇచ్చింది. ఇప్పటికే కొన్ని చోట్ల నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు. 

ఐదు చోట్ల ఆక్సిజన్ జనరేషన్ యూనిట్లు
కరోనా ఐపీ పెరుగుతుండడంతో ఆక్సిజన్ వాడకం పెరిగింది. దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ ఉండడంతో ఆక్సిజన్ కొరత ఏర్పడొచ్చని కేంద్రం అంచనా వేసింది. బయటి గాలిని తీసుకుని ఆక్సిజన్‌‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్లను హాస్పిటళ్లలో ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఇలా ఆక్సిజన్  జనరేట్ చేసే ఐదు మెషీన్లను మన రాష్ట్రానికి పంపించింది. వీటిని హైదరాబాద్‌‌లోని గాంధీ, టిమ్స్‌‌ హాస్పిటళ్లతోపాటు భద్రాచలం, ఖమ్మం, కరీంనగర్ జిల్లా హాస్పిటళ్లలో ఏర్పాటు చేయాలని హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్ నిర్ణయించింది.  

నేడు ప్రైవేట్‌‌ హాస్పిటళ్ల  మేనేజ్​మెంట్లతో ఈటల మీటింగ్
ప్రభుత్వ దవాఖాన్లపై ప్రెజర్‌‌ పెరుగుతుండడంతో ప్రైవేట్ టీచింగ్ హాస్పిటళ్లను వాడుకోవడంపై హెల్త్  డిపార్ట్‌‌మెంట్ దృష్టి‌‌ పెట్టింది. ఈ హాస్పిటళ్లకు మెడిసిన్‌‌, పీపీఈ కిట్లు ఇచ్చి అక్కడ  కూడా ఫ్రీగా ట్రీట్‌‌మెంట్ అందించే ఆలోచన చేస్తోంది. దీనిపై చర్చించేందుకు ప్రైవేట్ యాజమాన్యాలతో మంత్రి ఈటల రాజేందర్ శనివారం సమావేశం కానున్నారు. కరోనా పేషెంట్లను దోచుకుంటున్న  హాస్పిటళ్లతో.. చిన్న, మధ్యస్థాయి ప్రైవేట్ హాస్పిటళ్లతో మంత్రి మరో సమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి ఆఫీస్​ తెలిపింది.