నాగార్జునసాగర్‌లో ప్రైవేటు టీచర్ ఆత్మహత్య

నాగార్జునసాగర్‌లో ప్రైవేటు టీచర్ ఆత్మహత్య
  • ఏడాదిగా జీతాలు లేక ఆర్ధిక ఇబ్బందులు..
  • గొడవపడి భార్య వదిలేసి వెళ్లడంతో మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య

నల్గొండ: కరోనా కష్టాలు భరించలేక మరో ప్రైవేటు టీచర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆర్ధిక ఇబ్బందులు భరించలేక ఉక్కిరిబిక్కిరవుతూ అర్ధాకలితో అలమటిస్తుంటే ఈ కష్టాలు తాను భరించలేనంటూ కట్టుకున్న భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగార్జునసాగర్ లోని హిల్ కాలనీలో జరిగిన ఘటన విషాదం రేపింది.  ఒకవైపు రాజకీయ పార్టీల నేతలు ఉప ఎన్నిక ప్రచారాన్ని హోరెత్తిస్తున్న నేపధ్యంలో ఓ బక్కచిక్కిన ప్రైవేటు టీచర్ ఆర్ధిక కష్టాలు భరించలేక ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. గత ఏడాదిగా లాక్ డౌన్ వల్ల స్కూళ్లు మూతపడడంతో ఎంతో మంది ప్రైవేటు స్కూళ్ల టీచర్లు ఉపాధి కోల్పోయి రోడ్డునపడిన విషయం కళ్లారా చూస్తున్నాం. చాలా మంది బతుకు బండి లాగేందుకు కూరగాయలు, పండ్లు అమ్ముకుని భార్యా పిల్లలను పోషించుకుంటుంటే.. మరికొందరు కూలీలుగా, తాపీ మేస్త్రీలుగా.. చిల్లర వర్తకులుగా దినదినగండం నూరేళ్లాయుష్షులా బతుకుతున్నారు. ఇదే కోవలోనే నాగర్జునసాగర్ హిల్ కాలనీలో నివాసం ఉంటున్న రవి (30) డివైన్ మెర్సీ స్కూల్లో ప్రైవేటు టీచర్ గా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఏడాదిగా ప్రైవేట్ స్కూల్లో జీతాలు రాక కుటుంబాన్ని పోషించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. ఇల్లు గడవడం కష్టమైపోవడంతో నిన్న రాత్రి భార్యా భర్తల మధ్య వాగ్వాదం జరిగింది. భార్య ఇల్లు విడిచి పోవటంతో మనస్థాపానికి గురైన రవి తన ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.