మేనేజ్‌మెంట్ల నుంచి పిలుపు కొద్దిమందికే.. వేల మంది ప్రైవేట్ టీచర్ల అగచాట్లు

మేనేజ్‌మెంట్ల నుంచి పిలుపు కొద్దిమందికే.. వేల మంది ప్రైవేట్ టీచర్ల అగచాట్లు
  •  25 నుంచి 30 శాతం స్టాఫ్‌తోనే నడుస్తున్న ప్రైవేటు బడులు
  • వచ్చిన వాళ్లకూ తక్కువ జీతాలిస్తున్న మేనేజ్​మెంట్లు
  • పిల్లల్లేనప్పుడు టీచర్లు ఎందుకు అంటున్న తీరు
  • తక్కువ మంది టీచర్లతో నడిపిస్తున్నా పట్టించుకోని సర్కార్

హైదరాబాద్, వెలుగు: 

మేడ్చల్ జిల్లా జవహర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని ఓ ప్రైవేటు స్కూల్​లో గతంలో 25 మంది టీచర్లు పనిచేసేవారు. ప్రస్తుతం కేవలం ఏడుగురు టీచర్లను మాత్రమే స్కూల్​కు రావాలని మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ చెప్పింది. పిల్లలు వస్తే మిగిలిన వారిని పిలుస్తమని చెప్తోంది. హైదరాబాద్​ బండ్లగూడలోని ఓ హైస్కూల్​లో కరోనాకు ముందు 24 మంది టీచర్లు ఉండేవారు. ఇప్పుడు ఐదుగురిని మాత్రమే రమ్మన్నారు. సగం జీతమే ఇస్తామనడంతో పోయేందుకు చాలామంది ఇష్టపడటం లేదు. మిగిలిన వారికి కాల్ రాలేదు. ఇది ఈ రెండు స్కూళ్లలోని పరిస్థితి మాత్రమే కాదు.. రాష్ట్రంలోని మెజార్టీ ప్రైవేటు స్కూళ్లలో ఇదే దుస్థితి. ప్రస్తుతం ఫిజికల్ క్లాసులు ప్రారంభమైనా, ఇప్పటికీ ఏ స్కూల్ మేనేజ్​మెంట్ కూడా పూర్తిస్థాయిలో టీచర్లు, సిబ్బందిని తీసుకోలేదు. కొద్దిమంది టీచర్లతోనే క్లాసులు నడిపిస్తోంది. దీంతో వేలమంది ప్రైవేటు టీచర్లు రోడ్డున పడ్డారు. అయితే స్టూడెంట్లు పూర్తిస్థాయిలో రావడం లేదనీ అందుకే మొత్తం మందిని తీసుకోవడం లేదని మేనేజ్​మెంట్లు చెప్తున్నాయి. రాష్ట్రంలో 10,816 ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లుండగా వాటిలో 32.12 లక్షల మంది చదువుతున్నారు. దాదాపు రెండున్నర లక్షల మంది టీచర్లు, సిబ్బంది పనిచేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్​తో గతేడాది మార్చి నుంచి విద్యాసంస్థలు మూతపడటంతో టీచర్లు, సిబ్బంది రోడ్డునపడ్డారు. గత విద్యాసంవత్సరం ఆన్​లైన్ పాఠాలకు సర్కారు పర్మిషన్ ఇచ్చినా, చాలా స్కూళ్లు క్లాసులు కొనసాగించలేదు. కొన్ని స్కూళ్లు తక్కువ మంది టీచర్లతోనే ఆన్​లైన్ క్లాసులు నిర్వహించాయి. ఈ క్రమంలో వచ్చిన టీచర్లకు కూడా సగం జీతాలే చెల్లించారు. 

తక్కువ మందితోనే నడిపిస్తున్నరు..

ఈనెల ఫస్ట్ నుంచి ఫిజికల్ క్లాసులకు ప్రారంభమైనా ఇంకా వెయ్యి స్కూళ్ల దాకా ఓపెన్ కాలేదు. తెరిచిన స్కూళ్లకు కూడా స్టూడెంట్లు తక్కువగానే వస్తున్నారు. బుధవారం 26.52 శాతం మాత్రమే హాజరయ్యారు. తక్కువ మంది వస్తున్నారంటూ మేనేజ్​మెంట్లు.. అందరు టీచర్లను స్కూళ్లకు పిలవడం లేదు. 25శాతం నుంచి 30శాతం టీచర్లను మాత్రమే తీసుకున్నాయి. దీంతో వారితోనే అన్ని క్లాసులు చెప్పిస్తున్నారు. తెలుగు, హిందీ, ఫిజిక్స్, బయోలజీ.. ఇలా కొన్ని సబ్జెక్టులను ఇద్దరు చెప్పాల్సినవి ఒక్కరితో చెప్పిస్తున్నారు. జీతం కూడా గతం కంటే తక్కువగా ఇస్తున్నారు. మిగతా టీచర్లు మేనేజ్​మెంట్లకు ఫోన్ చేస్తే, పిల్లలు పూర్తిగా వస్తే పిలుస్తామంటున్నారు. అయితే తక్కువ మంది టీచర్లతో స్కూళ్లు నడిపిస్తున్నా, విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.

అవసరముంటే పిలుస్తమన్నరు

సిటీలో ఓ ప్రైవేటు స్కూల్​లో ఐదేండ్లుగా పనిచేస్తున్న. కరోనా పేరు చెప్పి కిందటేడాది సగం జీతమే ఇచ్చారు. అది కూడా కొన్ని నెలలది పెండింగ్ ఉంది. ప్రస్తుతం ముగ్గురినే రమ్మన్నారు. నేను మేనేజ్​మెంట్​కు కాల్ చేస్తే.. అవసరముంటే పిలుస్తామని చెప్పారు. కష్టకాలంలో ఇలా తొలగించడం మంచిదికాదు.

- లక్ష్మి, ప్రైవేటు టీచర్, హైదరాబాద్

పిల్లలు వస్తలేరు అందుకే

ఫిజికల్ క్లాసులు స్టార్ట్ అయినా కరోనా భయంతో పేరెంట్స్ పిల్లల్ని స్కూళ్లకు పంపించడం లేదు. వచ్చిన పిల్లలు కూడా ఫీజులు సరిగా కట్టడం లేదు. చాలా స్కూళ్లు ఆఫ్​డే నే నడుస్తున్నాయి. దీంతో ఉన్న స్టూడెంట్లకు సరిపడా టీచర్లనే మేనేజ్​మెంట్లు తీసుకుంటున్నాయి. పిల్లల సంఖ్య పెరగ్గానే, టీచర్లందరినీ కొనసాగిస్తాం.
- ఎస్​ఎన్ రెడ్డి, ట్రస్మా జనరల్ సెక్రటరీ