క్లాసులే కాదు.. ఎగ్జామ్స్ కూడా ఆన్‌లైన్ లో పెడ్తున్న ప్రైవేట్ స్కూల్స్

క్లాసులే కాదు.. ఎగ్జామ్స్ కూడా ఆన్‌లైన్ లో పెడ్తున్న ప్రైవేట్ స్కూల్స్

తెలిసినా పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
ఫీజులు కట్టినోళ్లకే అనుమతిస్తున్న మేనేజ్‌మెంట్స్
ఆందోళనలో పేరెంట్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. ఆన్‌లైన్ క్లాసులకు అనుమతి లేదని ప్రభుత్వం చెబుతుంటే, ఏకంగా ఆన్లైన్లో ఎగ్జామ్స్‌ పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా.. విద్యాశాఖ అధికారులు మాత్రం తమకేమీ తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారుల పిల్లలు కూడా ఆన్లైన్ పరీక్షలు రాస్తుండటం గమనార్హం. స్టేట్ లో 10,600 ప్రైవేటు స్కూల్స్ ఉన్నాయి. వీటిలో సగానికి పైగా స్కూళ్లు ఏదో రకంగా ఆన్‌లైన్ క్లాసులు కొనసాగిస్తూ.. పేరెంట్స్ నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఆన్‌లైన్ క్లాసులకు అనుమతి ఇవ్వలేదు. విద్యాశాఖ అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంతో మేనేజ్‌మెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

యాప్‌లు తయారు చేసుకున్న కొన్ని స్కూల్స్
కొన్ని కార్పొరేట్ స్కూళ్లు యాప్స్ తయారు చేయించుకుని, వాటిలోనే పిల్లలకు పాఠాలు, పేరెంట్స్ కు సూచనలు ఇస్తున్నాయి. ఎగ్జామ్స్ కూడా యాప్ ద్వారానే నిర్వహిస్తున్నాయి. గత సోమవారం చాలా స్కూళ్లలో ఎగ్జామ్స్ స్టార్ట్‌ అయ్యాయి. క్లాసులు వినాలంటే టర్మ్ ఫీజుతో పాటు మెయింటెనెన్స్ ఫీజు కూడా కట్టాల్సిందే. అప్పుడే వారికి స్కూల్లో టెక్ట్స్ బుక్స్ ఇస్తారు. ప్రస్తుతం మరో టర్మ్ ఫీజు కూడా చెల్లించాలని పేరెంట్స్ పై మేనేజ్‌మెంట్లు ఒత్తిడి తెస్తున్నాయి. ఫీజులు కట్టని పిల్లలను ఎగ్జామ్స్ కు అనుమతించడం లేదు. యాప్లో వారి ఐడీని బ్లాక్ చేస్తున్నారు. దీంతో పిల్లలు మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు.

పిల్లలకే కాదు.. పెద్దలకూ పరీక్షే…
కార్పొరేట్ స్కూళ్లలో ఒకటో తరగతి నుంచే ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 20 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకూ పరీక్ష ఉంటుంది. ఒక్కో మేనేజ్‌మెంట్ ఒక్కోరకంగా పరీక్షలు పెడుతున్నారు. కొందరు ఆన్‌లైన్లో ఎగ్జామ్స్ పెడతుండగా, మరికొందరు ఆన్సర్ షీట్లను స్కాన్ చేసి పెడుతున్నారు. పరీక్ష పిల్లలకు ఉన్నా.. పనులు మానుకుని వారి పక్కనే ఉండాల్సి వస్తోందని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరెంట్స్ ఇద్దరూ ఉద్యోగులున్న చోట.. ఒకరు సెలవు పెట్టాల్సి వస్తోందని చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆన్‌లైన్ క్లాసులు, ఎగ్జామ్స్ పెడుతున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

For More News..

చైనా బ్రాండ్లు నిషేధించినా ఎఫెక్ట్ ఏమీ ఉండదు

ఆన్‌‌లైన్ కంపెనీల్లో జాబ్స్ జోరు

రూ.లక్ష కోట్లతో మారనున్న రైతు లైఫ్