పండగ సీజన్ లో ప్రైవేట్ ట్రావెల్స్ దందా

పండగ సీజన్ లో  ప్రైవేట్ ట్రావెల్స్ దందా

ప్రయాణికుల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలుగా దండుకుంటున్నారు. సంక్రాంతి పండుగను సాకుగా చూపి..ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేశారు. కరోనా టైం అని చూడకుండా.. టికెట్ రేట్లపై.. రెండు, మూడింతలు వసూలు చేస్తున్నారు. ఇక ఏసీ, స్లీపర్ టికెట్ రేట్లు మరింత ఎక్కువే. కరోనా దెబ్బకు రైల్వే సరిపడా రైళ్లు నడపడం లేదు. దీనితో ప్రైవేట్ ట్రావెల్స్ దందాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.
సంక్రాంతికి వారం రోజుల ముందు నుంచే సొంతూర్ల బాటపట్టారు హైదరాబాద్ జనం. ఏపీకి వెళ్లే వాళ్లు పండక్కు నెలరోజుల ముందే బస్సు, ట్రైన్ రిజర్వేషన్లు చేసుకున్నారు. అయితే ఈ సారి కరోనా ఎఫెక్ట్ తో సరిపడా రైళ్లు అందుబాటులో లేవు. టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి స్పెషల్ బస్సులను నడుపుతున్నా…సరిపోకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయిస్తున్నారు జనం. ఇదే అదునుగా పండుగకు ఊరేళ్లే వారిని అడ్డంగా దోచుకుంటున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు. ఇష్టానుసారం టికెట్ రేట్లు పెంచారు. నార్మల్ డేస్ లో వుండే చార్జీల కంటే రెండు, మూడింతలు అదనంగా వసూలు చేస్తున్నారు.

పండక్కు ముందు హైదరాబాద్ నుంచి విజయ వాడకు వెళ్లాలంటే.. 400 నుంచి 500 వరకు ఉండేది. ఇప్పుడు 1200 నుంచి 1500 వరకు వసూల్ చేస్తున్నారు. నెల్లూరు, తిరుపతి, విశాఖ, బాపట్ల, గుంటూరు, కడప ప్రాంతాలకు అదనంగా తీసుకుంటున్నారు. ఏసి, స్లీపర్ క్లాస్ టికెట్లు వేలల్లోనే ఉంటున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ చేస్తున్నాయని మండిపడుతున్నారు ప్రయాణికులు. రోజు తెలంగాణ, ఏపీ ల మధ్య వివిధ సంస్థలకు చెందిన వందలాది బస్సులు నడుస్తుంటాయి. వీటిపై అధికారుల మానిటరింగ్ లేకపోవడంతో.. ప్రైవేట్ ఆపరేటర్లు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్నారు. ఎమర్జెన్సీ కింద ఎవరైనా టికెట్ బుక్ చేసుకోవాలంటే.. జేబులు ఖాళీ కావాల్సిందే. కరోనా దెబ్బతో.. కోల్పోయిన ఆదాయాన్ని సంక్రాంతి సీజన్లో రాబట్టుకునే పనిలో పడ్డారు ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు.

టీఎస్ ఆర్టీసీ సంక్రాంతి పండక్కి దాదాపు 5 వేల స్పెషల్ బస్సులను నడుపుతోంది. ఇందులో 1600 బస్సులు ఏపీ లోని వివిధ ప్రాంతాలకు తిప్పుతోంది. స్పెషల్ బస్సుల్లో ఛార్జ్ నార్మల్ కంటే ఒకటిన్నర శాతం ఎక్కువగా ఉంది.. ఇదే తరహాలో ప్రైవేట్ ట్రావెల్స్ తీసుకోవాలి. కానీ, మూడు నాలుగు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీని అడ్డుకునేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు ప్రయాణికులు