18 ఏండ్లు దాటినోళ్లకు ప్రైవేటులో టీకా

18 ఏండ్లు దాటినోళ్లకు ప్రైవేటులో టీకా
  • ఈ నెల 28 నుంచి షురూ
  • హాస్పిటళ్లతో మాట్లాడుకుని ఆఫీసుల్లో క్యాంపులు  పెట్టుకోవచ్చు
  • కంపెనీలు ఇచ్చే రేటుపైన మరో రూ.150  చార్జ్ చేయొచ్చు
  • అంతకు మించి తీసుకుంటే చర్యలు
  • పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ
  • 18 దాటిన సూపర్ స్ప్రెడర్లందరికీ సర్కారు సెంటర్లోనే ఫ్రీగా టీకా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 18 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ​ఇచ్చేందుకు సర్కార్​ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ వ్యాక్సిన్ సెంటర్లలో 18 ఏండ్లు దాటిన వారెవరైనా టీకా వేయించుకోవచ్చని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పబ్లిక్ ​హెల్త్​డైరెక్టర్ ​శ్రీనివాసరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేట్ హాస్పిటళ్లలోని వ్యాక్సిన్ సెంటర్లకు ప్రభుత్వం డోసులు సప్లై చేయదని, వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీల నుంచి నేరుగా ఆర్డర్లు ఇచ్చి కొనుగోలు చేసుకోవచ్చని అందులో పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్లను కంపెనీల నుంచి కొనుగోలు చేసిన ధరపై పబ్లిక్‌‌‌‌ నుంచి మరో రూ.150కి మించకుండా సర్వీస్ చార్జ్ వసూలు చేసుకోవచ్చని, అంతకు మించి ఎక్కువ తీసుకుంటే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు సమన్వయం చేసుకుని వర్క్ ప్లేస్‌‌‌‌లో తమ ఉద్యోగులకు ప్రైవేట్ వ్యాక్సిన్ సెంటర్ల ద్వారా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు, ఐటీ కంపెనీలు, ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న అన్ని రకాల ఆఫీసుల్లోనూ వ్యాక్సినేషన్​ క్యాంపులు పెట్టుకోవచ్చని స్పష్టం చేసింది. 
 

సూపర్‌‌‌‌‌‌‌‌ స్రెడర్లకు ఫస్ట్ ప్రయారిటీ
ప్రభుత్వం సెంటర్లలో 18 ఏండ్లు నిండిన సూపర్‌‌‌‌‌‌‌‌ స్ప్రెడర్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈ నెల 28 నుంచి వారికి టీకా ఇవ్వనున్నట్లు హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్ తెలిపింది.  ఇందుకోసం దాదాపు 4.90 లక్షల వ్యాక్సిన్​ డోసులను సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే సూపర్ స్ప్రెడర్లుగా రాష్ట్రంలో సుమారు 30 లక్షల మందిని గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు.

సూపర్‌‌‌‌‌‌‌‌ స్ప్రెడర్లు వీరే..
సూపర్‌‌‌‌‌‌‌‌ స్ప్రెడర్లుగా డ్రైవర్లు, గ్యాస్, ఫుడ్ డెలివరీ బాయ్స్, రేషన్ డీలర్లు, కిరణాషాపు నిర్వాహకులు, పెట్రోల్ పంపు సిబ్బంది, వీధి వ్యాపారులు, రైతు బజార్లలోని వ్యాపారులు, పాలు, పూలు, పండ్లు అమ్ముకునేవాళ్లు, మద్యం దుకాణాల సిబ్బంది, కొరియర్, మెడికల్ షాపు సిబ్బంది, పోస్టల్, రైల్వే, బ్యాంక్, విద్యుత్, ఆలయాల్లో పనిచేసే స్టాఫ్ తదితరులను గుర్తించారు. వీరందరికీ కేంద్రం నుంచి వచ్చే డోసుల సంఖ్య ఆధారంగా విడతల వారీగా వ్యాక్సినేషన్​ పూర్తి చేయనున్నారు.

మంత్రి హరీశ్‌‌‌‌ రావు రివ్యూ
రాష్ట్రంలో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ చేయడంపై మంగళవారం బీఆర్‌‌‌‌కే భవన్‌‌‌‌లో హెల్త్​ డిపార్ట్​మెంట్​ అధికారులతో మంత్రి హరీశ్ రావు, సీఎస్‌‌‌‌ సోమేశ్ కుమార్ రివ్యూ నిర్వహించారు. సూపర్‌‌‌‌ స్ప్రెడర్ల గుర్తింపు, విధివిధానాలపై చర్చించారు. ముందుగా ఆటో డ్రైవర్లకు టీకా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో ఒక్క జీహెచ్‌‌‌‌ఎంసీ పరిధిలోనే లక్ష మందికి పైగా ఉన్నారని, వారందరికీ ఒకే రోజులో వ్యాక్సిన్ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆటో డ్రైవర్లను గుర్తించే పని ట్రాన్స్‌‌‌‌పోర్ట్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు అప్పగించారు. ఆ తర్వాత వాళ్లు ఆయా సంఘాల ద్వారా రిజిస్టర్‌‌‌‌‌‌‌‌ చేసుకుంటే, ఆర్టీఏ ఆఫీసుల్లో వ్యాక్సిన్ వేయనున్నారు.