ప్రియదర్శి, ఆనంది జంటగా సుమ కనకాల కీలక పాత్ర పోషించిన చిత్రం ‘ప్రేమంటే’. థ్రిల్ యు ప్రాప్తిరస్తు అనేది ట్యాగ్‌లైన్. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మిస్తున్నారు. నవంబర్ 21న సినిమా విడుదల కానుంది.
మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ఒకపాటను విడుదల చేయగా, తాజాగా ‘పెళ్లి షురూ’ అంటూ సాగే రెండో పాటను హీరోయిన్ శ్రీలీల లాంచ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పింది. లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన ఈ పెళ్లి పాటకు శ్రీమణి లిరిక్స్ రాయగా.. శ్రేయా ఘోషల్, దీపక్ బ్లూ కలిసి పాడారు. ‘పెళ్లి షురూ.. దంచికొట్టు మేళం.. అదరగొట్టు తాళం.. విచ్చుకుంది ప్రేమ.. చెయ్యి పట్టు భామ..’ అంటూ ప్రియదర్శి, ఆనంది పెళ్లి సందర్భంగా సాగిన పాట ఆకట్టుకుంది.
కొత్త జీవితాన్ని మొదలుపెడుతున్న జంట భావోద్వేగాలను ఇందులో చక్కగా ప్రజెంట్ చేశారు. మ్యూజిక్ డ్రైవన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని మేకర్స్ చెప్పారు. కార్తీక్ తుపురాణి, రాజ్ కుమార్ ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు.
