Priyank Panchal: 29 సెంచరీలు.. 8వేలకు పైగా పరుగులు: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన గుజరాత్ దిగ్గజం

Priyank Panchal: 29 సెంచరీలు.. 8వేలకు పైగా పరుగులు: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన గుజరాత్ దిగ్గజం

దేశవాళీ పరుగుల వీరుడు ప్రియాంక్ పంచల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత 'ఎ' జట్టు మాజీ కెప్టెన్ ప్రియాంక్ పంచల్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోమవారం (మే 26) తెలిపాడు. దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా ఆడినా పంచల్ కు భారత క్రికెట్ లో చోటు దక్కలేదు. డొమెస్టిక్ క్రికెట్ లో ఈ గుజరాత్ దిగ్గజ బ్యాటర్ 29 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలతో 8856 పరుగులు సాధించాడు.2025లో ఇంగ్లాండ్‌లో భారత పర్యటనకు ముందు ప్రియాంక్ పంచల్ రిటైర్మెంట్ ప్రకటించినట్లు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (GCA) ధృవీకరించింది. 

2016-17లో పంచల్ గుజరాత్ జట్టును తొలి రంజీ ట్రోఫీ ఛాంపియన్‌షిప్‌ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా తరపున ఆడే అవకాశం రాకపోయినా గుజరాత్ దేశీయ స్థాయిలో గెలిచిన ప్రతి టైటిల్ లో పంచల్ పాత్ర ఉంది. గత సీజన్‌లో కేరళతో జరిగిన రంజీ ట్రోఫీలో పాంచల్ తన చివరి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడాడు.  కేరళతో జరిగిన తన చివరి ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో పాంచల్ 148 పరుగులు చేసిన గుజరాత్ ఓడిపోవడం తనను తీవ్రంగా బాధించింది. గుజరాత్ క్రికెట్ చరిత్రలో పార్థివ్ పటేల్ తర్వాత ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 7,000 కంటే ఎక్కువ పరుగులు సాధించిన రెండవ బ్యాట్స్‌మన్ పంచల్.
 
"ప్రియాంక్ 29 సెంచరీలు, 34 అర్ధ సెంచరీలతో 8856 ఫస్ట్-క్లాస్ పరుగులు చేశాడు. ఇందులో అద్భుతమైన 314* ఇన్నింగ్స్ కూడా ఉంది.  అతను 2016-17లో గుజరాత్‌ను తొలి రంజీ ట్రోఫీ టైటిల్‌ను అందించాడు. విజయ్ హజారే ట్రోఫీ (2015-16), సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ (2012-13 & 2013-14) లను కూడా గెలుచుకున్నాడు. ఇండియా ఏ , గుజరాత్‌ను అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ గ వ్యవహరించాడు. అతని అంకితభావానికి మేము సెల్యూట్ చేస్తాము". అని గుజరాత్ క్రికెట్ బోర్డు తెలిపింది.