యూపీలో మహిళల భద్రత కోసం 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు

 యూపీలో మహిళల భద్రత కోసం 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పై బాలీవుడ్ నటి, యునిసెఫ్ అంబాసిడర్ ప్రియాంక చోప్రా ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం తీసుకువచ్చిన 24/7 ఫోన్ లైన్ కంట్రోల్ రూమ్‭ను ఆమె సందర్శించారు. మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు జరిగితే.. ఉచితంగా ఫిర్యాదులను నమోదు చేసేందుకు 24/7 కంట్రోల్ రూమ్‭ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 1090 ఉమెన్ పవర్ లైన్ ప్రాముఖ్యతను ప్రియాంక ప్రశంసించారు. అలాగే.. మహిళల కోసం మంచి పథకాలు తీసుకువచ్చారని యోగి సర్కార్ పై పొగడ్తలు కురిపించారు. యునిసెఫ్‭కు సంబంధించిన కార్యక్రమాల్లో భాగంగా ప్రియాంక చోప్రా రెండు రోజుల పాటు ఉత్తరప్రదేశ్‭లో పర్యటించారు. 

ఈ సందర్భంగా అక్కడి పోలీస్ అధికారులతో ప్రియాంక చోప్రా సమావేశమయ్యారు. పోలీస్ అధికారులతో సమావేశమైన ఓ వీడియోను ఆమె తన ఇన్‭స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అందులో రాత్రి 7 గంటల తర్వాత ఇంటి నుంచి అడుగుభయట పెట్టాలంటే.. కలిగే భయాలను ప్రస్తావించారు. తాను కూడా లక్నోలోనే పెరిగానని చెప్పారు. ముఖ్యంగా రాత్రి 7 గంటల తర్వాత ఏదో భయం ఉండేదని అన్నారు. తర్వాత కాల్ ట్రాకింగ్ యూనిట్ పనితీరును ప్రియాంక పరిశీలించారు. నేరాల నియంత్రణలో డిజిటలైజేషన్ ఎలా సహాయపడిందో పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహిళల భద్రత ఎంతో అవసరమని ప్రియాంక అన్నారు. ఈ కాల్ ట్రాకింగ్ యూనిట్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ప్రియాంక చోప్రా అన్నారు. అయితే.. మహిళల రక్షణ కోసం ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఇంకా తీసుకురావాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.