విలీనం పేరుతో 5 వేల స్కూళ్లను క్లోజ్‌ చేసే కుట్ర..ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ ఫైర్‌‌

విలీనం పేరుతో 5 వేల స్కూళ్లను క్లోజ్‌ చేసే కుట్ర..ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ ఫైర్‌‌

న్యూఢిల్లీ: విలీనం పేరుతో ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ స్కూళ్లను మూసివేస్తుండటంపై కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ప్రభుత్వ స్కూళ్లను విలీనం పేరుతో యూపీ ప్రభుత్వం క్లోజ్‌ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇది విద్యా హక్కు చట్టానికి మాత్రమే కాదు.. దళితులు, వెనుకబడిన వర్గాలు, ట్రైబల్స్‌, మైనార్టీలు, పేదలు, అణగారిన వర్గాలకు వ్యతిరేకమని సోమవారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ‘‘విలీనం పేరుతో యూపీలో యోగి ప్రభుత్వం దాదాపు 5 వేల ప్రభుత్వ స్కూళ్లను మూసివేయనుంది. 

ఉపాధ్యాయ సంస్థల ప్రకారం.. దాదాపు 27 వేల స్కూళ్లను మూసివేయడమే ప్రభుత్వ ఉద్దేశం. యూపీఏ ప్రభుత్వం దేశంలో విద్యా హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం పేద కుటుంబాల పిల్లలకు విద్యను అందుబాటులో ఉండేలా ప్రతి గ్రామంలో పాఠశాలలు ఏర్పాటు చేసింది. ఇంటి నుంచి కిలోమీటర్ల దూరంలో స్కూళ్లు ఉంటే చిన్న పిల్లలు, ముఖ్యంగా బాలికలు ఎలా నడిచి వెళ్తారు? చదువుకునే హక్కును పిల్లల నుంచి ఎందుకు లాక్కుంటున్నారు” అని యూపీ సర్కార్‌‌ను ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.