
హిమాచల్ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ ప్రారంభించారు . ఈ సందర్భంగా బీజేపీపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. మోడీ సర్కార్ పేదలకు ఏం చేయదు కానీ.. బడాబాబులకు రుణాలు మాఫీ చేస్తుందని విమర్శించారు. యువత, ఉద్యోగులు, మహిళలకు బీజేపీ పాలనలో ఒరిగిందేమి లేదన్నారు. ఐదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు .
హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి కేబినెట్ లోనే లక్ష ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకుంటామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. అంతేకాకుండా పాత పెన్షన్ స్కీమ్ నే అమలు చేస్తామన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ ఆలయంలో పూజలు చేసిన తర్వాత.. పరివర్తన్ ప్రతిజ్ఞ ర్యాలీలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.
అటు హిమాచల్ప్రదేశ్ లో ఒకే దశలో ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 68 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో నవంబర్ 12న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. హిమాచల్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరితో పూర్తికానుంది. ప్రస్తుతం హిమాచల్లో అధికార ఎన్డీఏకు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.