మాయావతికి ప్రియాంక గాంధీ పరామర్శ

మాయావతికి ప్రియాంక గాంధీ పరామర్శ

బీఎస్పీ అధినేత్రి మాయావతిని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ కలిశారు. ఇటీవలే మాయావతి తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో మాయావతిని కలిసిన ప్రియాంక పరామర్శించారు. మాయావతి తల్లి రామార్తి వయసు 92 ఏళ్లు. ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె హార్ట్ ఫెయిల్ అవ్వడంతో కన్ను మూశారు. తల్లి మరణ వార్త తెలియగానే మాయావతి వెంటనే ఢిల్లీకు బయల్దేరారు. ఆదివారం తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఏడాది క్రితం మాయావతి తండ్రి కూడా చనిపోయారు. 

మరోవైపు యూపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో .. మాయావతి ఎన్నికల ప్రచారంలో బిజీగా మారారు. అయితే ఈ సారి తాము ఎన్నికల్లో ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవడం లేదన్నారు. 2007 ఎన్నికల్లో గెలిచిన విధంగానే వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో కూడా తమ పార్టీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు. ఏ పార్టీతో కూడా పోల్ ఎగ్రిమెంట్ ఉండదన్నారు. మేం కేవలం ప్రజలతోనే పొత్తు పెట్టుకుంటామన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలతో పొత్తే శాశ్వతమన్నారు. ఈ సందర్భంగా ఆమె సమాజ్ వాదీ పార్టీపై విమర్శలు గుప్పించారు. సమాజ్ వాదీ, భారతీయ జనతా పార్టీలు ఒకే నాణానికి బమ్మ బొరుసు లాంటివన్నారు. 

మరోవైపు కాంగ్రెస్ పార్టీపై కూడా బీఎస్పీ అధినేత్రి ఆరోపణలు చేశారు. తప్పుడు వాగ్ధానాలతో ఓటర్లను కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల వాగ్ధానాల్లో 50శాతం అయిన నెరవేర్చినట్లయితే.. కేంద్రం, యూపీతో పాటు చాలా రాష్ట్రాల్లో వారు అధికారం కోల్పయి ఉండేవారు కాదన్నారు. ప్రియాంక గాంధీ మాట్లాడుతూ... యూపీలో గెలిచేది కాంగ్రెస్ పార్టీయే అన్నారు.  అన్ని స్థానాల్లో కూడా తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. యూపీలో యోగి పాలనతో ప్రజలు విసిగెత్తి పోయారన్నారు ప్రియాంక. ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీపై నమ్మకం ఉందన్నారు. 

దేశవ్యాప్తంగా ఉన్న అత్యధిక అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు ఉన్న రాష్ట్రం యూపీ. 2022లో ఉత్తర్ ప్రదేశ్‌లో 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2017 ఎన్నికల్లో బీజేపీ యూపీలో ఘన విజయం సాధించింది. 312 స్థానాల్లో విజయ బావుటా ఎగురవేసింది. ఆ పార్టీ 39.67 శాతం ఓట్లను సాధించింది.