రాహుల్ గాంధీ.. ఓ వారియర్:ప్రియాంక గాంధీ

రాహుల్ గాంధీ.. ఓ వారియర్:ప్రియాంక గాంధీ

ఘజియాబాద్: రాహుల్ గాంధీ.. ఓ వారియర్ అని ప్రియాంక గాంధీ అన్నారు. తన అన్నను చూసి ఎంతో గర్వపడుతున్నానని ఆమె చెప్పారు. 9 రోజుల గ్యాప్ తర్వాత భారత్ జోడో యాత్ర మంగళవారం తిరిగి ప్రారంభమైంది. యాత్ర ఉత్తరప్రదేశ్​లోకి ఎంటర్ కాగా, లోనీ బార్డర్ వద్ద ప్రియాంక స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘మా అన్న ఇమేజ్​ను దెబ్బతీసేందుకు ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెట్టింది. కానీ రాహుల్ తన సత్య మార్గాన్ని వీడలేదు. ఏజెన్సీలను రంగంలోకి దించి ఒత్తిడి పెంచినా భయపడలేదు. అతనో వారియర్.. అందుకు గర్వపడుతున్నాను” అని ప్రియాంక అన్నారు. ‘‘పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అయిన అదానీ, అంబానీ లాంటోళ్లు చాలామంది రాజకీయ నాయకులను, ప్రభుత్వరంగ సంస్థలను, మీడియాను కొని ఉండొచ్చు. కానీ నా అన్నను కొనలేకపోయారు. వాళ్లు ఎప్పటికీ కొనలేరు” అని అన్నారు. 

తొవ్వ పొంట ఘన స్వాగతం.. 

యమునా బజార్​లోని హనుమాన్ మందిర్ నుంచి యాత్ర తిరిగి ప్రారంభమైంది. వేలాది మంది కార్యకర్తలతో కలిసి రాహుల్ యాత్ర ప్రారంభించారు. ఘజియాబాద్​కు వెళ్తుండగా తొవ్వ పొంట కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. యాత్ర రూట్​లో వేదికలు ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చాలామంది రాహుల్ బొమ్మ ఉన్న టీషర్టులను వేసుకున్నారు. 

రాహుల్ కు బీజేపీ కౌంటర్.. 

బార్డర్ ఇష్యూపై ఓ ఇంటర్వ్యూలో రాహుల్ చేసిన కామెంట్లకు బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశ్ త్రివేది కౌంటర్​ ఇచ్చారు. ‘కాంగ్రెస్ హయాంలో జరిగినట్లుగానే.. ఇప్పుడు కూడా చైనా ముందు మన దేశం లొంగిపోవాలని రాహుల్ కోరుకుంటున్నారు. ఆ ఇంటర్వ్యూ ఎప్పుడూ అయోమయంలో ఉండే, టెన్షన్ పడే లీడర్ కు.. గందరగోళ పడే స్టార్ కు మధ్య జరిగింది” అని త్రివేది విమర్శించారు.