పరిష్కారం కానీ అంశాలుంటే నా దృష్టికి తీసుకురావాలి

పరిష్కారం కానీ అంశాలుంటే నా దృష్టికి తీసుకురావాలి

న్యూఢిల్లీ, వెలుగు: ఇకపై తెలంగాణ విషయాలను తానే పర్యవేక్షిస్తానని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో సాధ్యమైనంత వరకు పరిష్కరించుకోవాలని, పరిష్కారం కానీ అంశాలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. గురువారం ఢిల్లీలో తెలంగాణ ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, రోహిత్ చౌదరి, నదీమ్ జావేద్​లు ప్రియాంకతో భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు సాగిన భేటీలో తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీలోని అంతర్గత అంశాలపై ఆమె ఆరా తీసినట్లు తెలిసింది.

ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టి, ఏఐసీసీ సెక్రటరీ శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఇతర నేతలతో జరిగిన మీటింగ్ లో వారిచ్చిన అభిప్రాయాలను ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అలాగే, ఎంపీ వెంకట్ రెడ్డి ప్రస్తావించిన అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అంతర్గత అంశాలు, ఐక్యత లేకపోవడంపై ఆమె కొంత సీరియస్ అయినట్లు తెలిసింది. అందువల్ల ఇకపై తానే అన్నీ అంశాలను పర్యవేక్షిస్తానని, రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి ఈ నిర్ణయం మేలు చేస్తుందని ప్రియాంక భావిస్తున్నట్లు ఏఐసీసీలో ప్రచారం జరుగుతోంది.