
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే మళ్లీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. సోలన్ జిల్లాలోని తోడో మైదాన్‌లో శుక్రవారం జరిగిన పరివర్తన్ ప్రతిజ్ఞ ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు. అధికారం చేపట్టిన వెంటనే పాత పెన్షన్ విధానంతో పాటు లక్ష ఉద్యోగాల కల్పనపై తొలి నిర్ణయం తీసుకుంటామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 63 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. అయినా నిరుద్యోగ యువతకు బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించలేదని ఆరోపించారు. వచ్చే ఐదేళ్లలో యువతకు ఐదు లక్షల జాబ్స్ .. అలాగే, మహిళలకు నెలకు రూ.1500 చొప్పున భృతి ఇస్తామని వాగ్దానం చేశారు.