
సరిగ్గా ఎన్నికలు మరో నెలకు అటో ఇటో ఉండగా ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ లో కొత్త స్కీమ్ ప్రారంభించారు. శుక్రవారం (సెప్టెంబర్ 26) ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకాన్ని ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ స్కీమ్ కోసం 7 వేల 500 కోట్ల రూపాయలను 75 లక్షల మహిళల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఒక్కో మహిళలకు 10 వేల రూపాయలను నేరుగా వారి అకౌంట్లో జమ చేశారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు.
ఓట్లు కొనేందుకే ఈ స్కీమ్: ప్రియాంక గాంధీ
బీహార్ లో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు ఉండగా కొత్త స్కీమ్ ప్రకటించడమేంటని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. మహిళలకు గౌరవం ఇవ్వని వాళ్లు.. డైరెక్టుగా ఓట్లు కొనేందుకు అకౌంట్లో డబ్బులు వేస్తున్నారని విమర్శించారు. పాట్నాలో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా.. మహిళలను గౌరవించడమంటే వాళ్లు ఆర్థికంగా ఎందిగేందుకు కృషి చేయాలి కానీ ఎన్నికల ముందు అకౌంట్లో డబ్బులు వేసి ఓట్లు కొనాలని చూడటం కాదని మండిపడ్డారు.
మహిళలకు ఎవరు గౌరవం ఇస్తారో మీరు చూడాలి.. రెస్పెక్ట్ అంటే పది రోజుల ముందు అకౌంట్లో పది వేల రూపాయలు వేయడం కాదు.. అది మిమ్మల్ని కొనేందుకే.. మీకు గౌరవం దక్కడం అంటే నెలకు మంచి జీతం రావడం.. మంచి ఉద్యోగాలు రావడం.. మీ కాళ్ల మీద మీరు నిలబడేలా ప్రభుత్వం సహాయం చేయడం.. మీ చిన్నారులు స్కూల్ కు వెళ్లి సేఫ్ గా తిరిగిరావడం. అది చేయకుండా ఓట్ల కోసం అకౌంట్లో డబ్బులు వేసే వారి చిత్తశుద్ధి ఏంటో మీరు గ్రహించాలని అన్నారు.
బీజేపీ, నితీశ్ కుమార్ ప్రభుత్వం మీకు ఎప్పుడు ఆ రెస్పెక్ట్ ఇవ్వదు. ఇక్కడ మీ హక్కుల కోసం మీరు గొంతెత్తితే కొట్టి జైళ్లో వేశారు. ఇదేనా రెస్పెక్ట్ అంటే అంటూ ప్రశ్నించారు ప్రియాంక.
ఎలక్షన్లు ఒక నెల రోజులున్నాయి. వాళ్లు మీ అకౌంట్లో పది వేలు వేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే ప్రభుత్వం ఇక్కడ గత 20 ఏళ్లుగా ఉంది కదా. ఈ 20 ఏళ్లలో ఎందుకు అకౌట్లో 10 వేలు వేయలేకపోయారు. ప్రతీ నెలా వేస్తామని కూడా చెప్పరు. ఎన్నికలు పూర్తయ్యాక ఆ స్కీమే ఉండదు.. అంటూ ఫైరయ్యారు.
అయితే శుక్రవారం స్కీమ్ ప్రారంభించిన మోదీ.. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ పథకం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ముందుగా పది వేలు వేసి.. ఆ తర్వాత వారు వ్యాపారం తదితర పనుల్లో వారి పురోగతి ఆధారంగా 2 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు.