నేషనల్ హెరాల్డ్ కేసు.. రూ.752 కోట్ల ఆస్తులు అటాచ్

నేషనల్ హెరాల్డ్ కేసు.. రూ.752 కోట్ల ఆస్తులు అటాచ్

న్యూఢిల్లీ:   నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికపై మనీలాండరింగ్‌ కేసులో రూ.751.90 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసినట్లు ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తెలిపింది. నేషనల్ హెరాల్డ్ పబ్లిషర్ అయిన అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌(ఏజేఎల్)తో పాటు హోల్డింగ్ కంపెనీ అయిన యంగ్ ఇండియన్ ప్రై.లిమిడెట్ కు తాత్కాలిక ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పింది. భారత్ లోని ఢిల్లీ, ముంబై, లక్నో ప్రాంతాల్లో  ఏజేఎల్‌ రూ.661.9 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నట్టు ఈడీ తెలిపింది. ఏజేఎల్ లో ఈక్విటీ షేర్ల రూపంలో యంగ్ ఇండియన్ రూ.90.21 కోట్ల ఆస్తులను కలిగి ఉందని చెప్పింది. ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేల స్టేట్ మెంట్ లను ఇప్పటికే ఈడీ రికార్డ్ చేసింది.

ఏజేఎల్ ఆస్తులను ఈడీ సీజ్ చేయడంతో మల్లికార్జున ఖర్గే స్పందించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలను చూసి బీజేపీ భయపడుతోందని, ఏజేఎల్ ఆస్తులను అటాచ్ చేయడమే అందుకు స్పష్టమైన సూచన అని అన్నారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఆ పార్టీ ఓటమి అంచున నిల్చోవడంతో దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందన్నారు. కానీ ప్రయత్నాలన్నీ విఫలమై ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమన్నారు. ఎన్నికలప్పుడు  దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేయడం కొత్తేమీ కాదన్నారు. ప్రస్తుతం అది దేశం ముందు పూర్తిగా బహిర్గతమయిందన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక దేశ స్వాతంత్ర్య ఉద్యమ గొంతుక అని అన్నారు. ఆ ఉద్యమంలో కాంగ్రెస్ పోషించిన పాత్రను చూసి తాము గర్విస్తున్నామని పేర్కొన్నారు.