టీకా కొరతేం లేదు.. ప్లానింగ్ లోనే తప్పిదం

టీకా కొరతేం లేదు.. ప్లానింగ్ లోనే తప్పిదం

న్యూఢిల్లీ: టీకా కొరత మీద పలు రాష్ట్రాలు ఫిర్యాదు చేస్తున్నాయి. రెండు, మూడ్రోజులకు సరిపడా నిల్వలే ఉన్నాయని పంజాబ్, ఢిల్లీ సీఎంలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వ్యాక్సిన్ కొరత సమస్య కాదని.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి మొత్తంగా 1.67 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేశ్ భూషణ్ స్పష్టం చేశారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటికే 13.10 కోట్ల పైచిలుకు టీకా డోసులను పంపిణీ చేశామన్నారు. ఈ నెలాఖరుకు మరో 2 కోట్ల డోసులను సరఫరా చేస్తామన్నారు. అసలు సమస్య ప్లానింగ్ తోనేనని, టీకా డోసుల నిల్వలు సరిపడా ఉన్నాయని తెలిపారు. వ్యాక్సిన్ డోసుల వృథా సరికాదని మండిపడ్డారు. కేరళ టీకా డోసులను వృథా చేయడం లేదని, కానీ కొన్ని రాష్ట్రాలు 8 నుంచి 9 శాతం డోసులను వేస్ట్ చేస్తున్నాయని విమర్శించారు.