నర్సింగ్‌‌ సదువు నామ్‌‌కే వాస్తే: పోస్టుల్లేవు.. ఉన్నా భర్తీల్లేవు

నర్సింగ్‌‌ సదువు నామ్‌‌కే వాస్తే: పోస్టుల్లేవు.. ఉన్నా భర్తీల్లేవు

సర్కారీ నర్సింగ్‌‌ కాలేజీలు సమస్యల్లో చిక్కుకున్నాయి. అరకొర వసతులతో కొట్టుమిట్టాడుతున్నాయి. సరిపడ ఫ్యాకల్టీ లేక ఇబ్బంది పడుతున్నాయి. డిప్యూటేషన్‌‌ సిబ్బందితోనే నెట్టుకొస్తున్నాయి. సొంత బిల్డింగుల్లేక సతమతమవుతున్నాయి. అద్దె బిల్డింగుల్లోని ఇరుకు గదుల్లోనే క్లాసులు, హాస్టళ్లు కొనసాగుతున్నాయి.

పోస్టుల్లేవు.. ఉన్నా భర్తీల్లేవు

రాష్ట్రంలోని ఒక్క సర్కారీ నర్సింగ్‌‌ కాలేజీలోనూ సరిపడా ఫాకల్టీ లేరు. మొత్తం ఆరు కాలేజీల్లో మూడింటిని డిప్యూటేషన్‌‌తో నెట్టుకొస్తున్నారు. హైదరాబాద్‌‌లోని గాంధీ, ఆదిలాబాద్‌‌లోని రిమ్స్‌‌, జగిత్యాలలోని ప్రభుత్వ నర్సింగ్‌‌ కాలేజీల్లో ఇప్పటివరకూ టీచింగ్‌‌ పోస్టులు సృష్టించలేదు. రిమ్స్‌‌లో ఆరుగురు స్టాఫ్ నర్సులను డిప్యూటేషన్‌‌పై నర్సింగ్‌‌ కాలేజీకి తీసుకున్నారు. వాళ్లలోనే ఒకరు ప్రిన్సిపల్‌‌గా వ్యవహరిస్తున్నారు. ఐదుగురు క్లాసులు చెబుతున్నారు. గాంధీలోనూ ఇదే పరిస్థితి. వేర్వేరు దవాఖాన్లలోని 14 మంది నర్సులను డిప్యుటేషన్‌‌పై లెక్చరర్లుగా నియమించారు. ఇక్కడ ఒక్క ప్రొఫెసర్ కూడా లేరు. జగిత్యాల కాలేజీలోనూ ఇదే దుస్థితి. ఏడుగురు నర్సులను డిప్యుటేషన్‌‌పై తీసుకుని కాలేజీ నడిపిస్తున్నారు. ఉస్మానియాకు అనుబంధంగా ఉన్న హైదరాబాద్‌‌ నర్సింగ్ కాలేజీలో మంజూరైన 12 లెక్చరర్ పోస్టులకు 11 ఖాళీగా ఉన్నాయి. వరంగల్‌‌ నర్సింగ్‌‌ కాలేజీలో 4 లెక్చరర్ పోస్టులకు నాలుగూ ఖాళీనే. ఈ కాలేజీకి ఒకే ఒక్క ప్రొఫెసర్ పోస్టు మంజూరైతే అదీ భర్తీ చేయలేదు. 2018లో మొదలైన సిరిసిల్ల కాలేజీకి 40 టీచింగ్‌‌ పోస్టులు మంజూరైతే 35 ఖాళీగానే ఉన్నాయి.

రిమ్స్ మెడికల్‍ కాలేజీకి అనుబంధంగా 2013లో బీఎస్సీ నర్సింగ్‍ కాలేజీని మంజూరు చేశారు. కాలేజీ మొదలై ఏడేళ్లవుతున్నా పక్కా బిల్డింగు లేదు. రిమ్స్‌‌ హాస్పిటల్‌‌లోని మూడో అంతస్తులో వార్డుల నడుమ కాలేజీని నడిపిస్తున్నారు. హాస్టలూ అందులోనే ఉంది. ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల రిమ్స్‌‌కు వెళ్లినప్పుడు నర్సింగ్ స్టూడెంట్లు అడ్డుకున్నారు. ఫాకల్టీ, బిల్డింగు, వసతులపై నిలదీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కాలేజీలో ముగ్గురు ప్రొఫెసర్లు ఉన్నారు. వీళ్లలో ఒకరు ప్రిన్స్‌‌పల్‌‌గా పని చేస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఓ అద్దె బిల్డింగులోనే కాలేజీ నడుస్తోంది.

గాంధీలో నో సెక్యూరిటీ

గతంలో గాంధీ మెడికల్ కాలేజీ స్టూడెంట్లకు కేటాయించిన హాస్టల్‌‌ భవనాన్ని గాంధీ నర్సింగ్‌‌ కాలేజీకిచ్చారు. 126 రూములున్న హాస్టల్‌‌ బిల్డింగులో ఒక్క స్వీపర్‌‌‌‌గానీ, వాచ్‌‌మెన్‌‌గానీ లేరు. 200 మంది అమ్మాయిలుండే బిల్డింగుకు కాంపౌండ్ వాల్ కూడా సరిగా లేదు. గాంధీ మెడికల్‌‌ కాలేజీ నుంచి ఒకరిద్దరు సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు. పక్కనున్న బాయ్స్‌‌ హాస్టల్ నుంచి అబ్బాయిలు వచ్చి రాత్రిపూట అల్లరి చేస్తున్నారని అమ్మాయిలు చెబుతున్నారు. గాంధీ నర్సింగ్‌‌ కాలేజీ నుంచి నగరంలో దవాఖాన్లకు స్టూడెంట్లను తరలించేందుకు 32 సీటర్ కెపాసిటీ బస్సుంది. డ్రైవర్‌‌‌‌ లేక మూలకు పడింది.

స్టూడెంట్ల నుంచి వసూళ్లు

సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం నర్సింగ్ కాలేజీల నిర్వహణను గాలికొదిలేసింది. దీంతో కాలేజీ, హాస్టల్‌‌ మెయింటనెన్స్‌‌, బస్సుల్లో డీజిల్, మెస్ ఫీజు, స్టేషనరీ పేర్లతో స్టూడెంట్ల నుంచే డబ్బులు వసూలు చేస్తున్నారు. కొంత మంది అందినకాడికి దోచుకుంటున్నారు. గతంలో గాంధీ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్‌‌గా పని చేసిన వ్యక్తి స్టూడెంట్ల నుంచి రూ.6 లక్షలు వసూలు చేసి సొంతానికి వాడుకున్నట్టు ఆరోపణలొచ్చాయి. దీనిపై స్టూడెంట్లు ధర్నా కూడా చేశారు.