- ఒక్కో వర్సిటీకి ముగ్గురి పేర్లు ఫైనల్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో వైస్ చాన్స్లర్ల(వీసీ) నియామకానికి సంబంధించిన ప్రక్రియ వేగవంతమైంది. గురువారం మూడు వర్సిటీలకు సంబంధించిన సెర్చ్ కమిటీ సమావేశాలు జరిగాయి. సెక్రటేరియెట్‌లో ఉస్మానియా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, పాలమూరు వర్సిటీలకు చెందిన సెర్చ్ కమిటీ సమావేశాలు నిర్వహించారు. స్టేట్ గవర్నమెంట్ తరఫున సీఎస్ శాంతికుమారి సెర్చ్ కమిటీ సభ్యురాలిగా పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు జరగాల్సిన ఓయూ సెర్చ్ కమిటీ సమావేశాన్ని.. ఉదయం 10గంటలకు నిర్వహించారు.
యూఎస్ లో ఉన్న ఒక సభ్యుడి సౌకర్యార్థం టైమ్ మార్చగా, ఆయన ఆన్‌లైన్‌ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత పాలమూరు, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ సమావేశాలు జరిగాయి. ఒక్కో వర్సిటీకి ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లను సభ్యులు ఫైనల్ చేశారు. శుక్రవారం జేఎన్టీయూ, తెలంగాణ, శాతవాహన వర్సిటీలకు సంబంధించిన సెర్చ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే మహాత్మాగాంధీ వర్సిటీ సమావేశం జరిగిన విషయం తెలిసిందే.
మూడు వర్సిటీల కమిటీలు వాయిదా
ప్రస్తుతం బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీల సెర్చ్ కమిటీలు వాయిదా పడగా, తాజాగా కాకతీయ వర్సిటీ సెర్చ్ కమిటీ మీటింగ్ పోస్ట్ పోన్ అయినట్టు తెలిసింది. శుక్రవారం ఉదయం జరగాల్సిన కేయూ సెర్చ్ కమిటీ.. ఆకస్మికంగా వాయిదా పడింది. ఆ కమిటీలో ప్రొఫెసర్ హరగోపాల్ మెంబర్ గా నియమించగా ఆయన తప్పుకున్నారు. ఆయన స్థానంలో జేఎన్టీయూ ప్రొఫెసర్ దామోదర్ ను నియమించారు.