
- పాఠశాలల విలీన ప్రక్రియకు చర్యలు
- మారనున్న గ్రామీణ విద్య రూపురేఖలు
నాగర్‌కర్నూల్, వెలుగు: గ్రామీణ ప్రాంతంలో విద్యను బలోపేతం చేయడంలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలకేంద్రంలో సెమీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ విద్యా కమిషన్ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్ట్ కింద వంగూరులో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
నర్సరీ నుంచి ఇంటర్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్, నర్సరీ నుంచి రెండవ తరగతి వరకు తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ పంపించిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చుతుండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రక్రియ షురూ..
ఈ విద్యా సంవత్సరంలోనే వంగూరు మండలకేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభించాలనే లక్ష్యంతో అధికారులు పాఠశాలల విలీన ప్రక్రియను ప్రారంభించారు. వంగూరులో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జడ్పీ హైస్కూల్, జడ్పీ గర్ల్స్ హైస్కూల్, జూనియర్ కాలేజీతో పాటు రెండు ప్రైమరీ స్కూల్స్‌ను విలీనం చేశారు. ఇదే క్యాంపస్‌లో కేజీబీవీ కూడా ఉంది. ఒక బ్లాక్‌లో రెండు హైస్కూల్స్, మరో బ్లాక్‌లో రెండు ప్రైమరీ స్కూల్స్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లుచేశారు.
అన్ని హంగులతో..
వంగూరులో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్లో రూ.12 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులు, జాతీయ స్థాయి క్రీడా మైదానాలు, హైటెక్ ప్రమాణాలతో డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, ఔట్ డోర్, ఇండోర్ గేమ్స్‌కు సౌలతులు కల్పించనున్నారు. 1,500 నుంచి 1800 మంది విద్యార్థులకు టీపీఎస్‌లో అడ్మిషన్లు ఇవ్వనున్నారు. ఈ స్కూల్లో చదువుకునే స్టూడెంట్లకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్ అందిస్తారు.
విద్యార్థుల విద్య, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని స్టాండర్డ్ మెనూ రూపొందించారు. గ్రామీణ ప్రాంత పేద, మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా సెమీ రెసిడెన్షియల్ విధానంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించనున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్‌కు వచ్చే విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తారు. ఇందుకోసం మినీ బస్సులు ఏర్పాటు చేస్తున్నారు.
అడ్మిషన్లు పెరిగినయ్..
వంగూరులో ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్లో అడ్మిషన్లు పెరిగాయి. ఇప్పటికే నాలుగు స్కూల్స్ విలీన ప్రక్రియ పూర్తయింది. అన్ని హంగులతో బిల్డింగ్ పూర్తయితే ఆధునిక వసతులు అందుబాటులోకి వస్తాయి. సెమీ రెసిడెన్షియల్ విధానంలో విద్యాబోధన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరంగా మారుతుంది.-మరిగంటి మురళీ మోహనాచారి. కన్వీనర్, టీపీఎస్