ఇప్పటివరకూ స్ట్రెయిట్ సినిమాలే నిర్మించిన దిల్ రాజు.. ఇప్పుడు రీమేక్ సినిమాలపై దృష్టి సారించారు. శర్వానంద్, సమంత జంటగా ప్రేమ్ కుమార్ రూపొందించిన ‘జాను’ వాటిలో ఒకటి. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు..
సంక్రాంతి విన్నర్ ఎవరంటే తెలుగు ఇండస్ట్రీనే. ఇద్దరు స్టార్ హీరోల క్రేజీ సినిమాలు ఒకే సీజన్‌లో వచ్చి రెండూ హిట్టవడం అరుదు. ఒకరిది ఇండస్ట్రీ హిట్, మరొకరిది కెరీర్ హిట్ అవడం, సంచలన వసూళ్లు రాబట్టడం చూసి మైండ్ బ్లాక్ అయింది. ఇద్దరు హీరోలకీ ఆల్ టైమ్ హిట్స్ లభించాయి. నాలుగు సినిమాలు రిలీజ్ చేసిన నాకు కూడా ఇది బిగ్ టైమ్.
ఓ సినిమాని రీమేక్ చేయాలంటే దాన్ని మనం మిస్ అవకూడదనే ఎక్స్‌ట్రార్డినరీ ఫీలింగ్ రావాలి. అది ‘96’ టీజర్ చూసినప్పుడు కలిగింది. అందుకే రిలీజ్‌కి ముందే మెదడుతో కాకుండా హృదయంతో చూశాను. మెదడైతే ఎంత వస్తుంది అని లెక్కేస్తుంది. మనసుకైతే కనెక్టవడం మాత్రమే తెలుసు. అందుకే ఇది నా హార్ట్‌కి నచ్చిన సినిమా అంటాను. తమిళం అంతగా అర్థం కాకపోయినా సినిమాలోని మూమెంట్స్ నచ్చాయి. వెంటనే నిర్మాతకి అడ్వాన్స్ ఇచ్చాను. అప్పుడే దర్శకుడితోనూ మాట్లాడేశాను.
ఫీడ్ బ్యాక్ కోసం నానికి చూపించాను. సూపర్ సినిమా అన్నాడు. రిలీజ్ కి రెండు రోజుల ముందు తమిళ చిత్రం బన్నీకి చూపించాను. క్లాసిక్ అన్నాడు. ఒపీనియన్ కోసమే వాళ్లకి చూపించా. కనెక్ట్ అయితే చేస్తారనే చిన్న ఆశ కూడా ఉంది. రిలీజ్ రోజున చెన్నై వెళ్లి సింగిల్ స్క్రీన్‌తో పాటు మల్టీప్లెక్స్ ప్రేక్షకుల స్పందన గమనించాను. నా నమ్మకం నిజమైంది. హిట్ టాక్ వచ్చింది.
త్రిష అద్భుతంగా నటించారు. పోల్చి చూస్తారని సమంత భయపడి రీమేక్‌లో నటించనంది. సమంతని, శర్వాని నేనే ఒప్పించాను. సమంత కొంత సమయం తీసుకుని ఒప్పుకుంది కానీ శర్వానంద్ నాపై నమ్మకంతో ఒక్క రోజులో ఓకే చెప్పాడు. తెలుగు కోసం కొన్ని మార్పులు చేయాలని దర్శకుడికి కొన్ని ఇన్‌పుట్స్ ఇచ్చాను. కానీ శర్వా పాత్రలో స్పీడు పెంచడం మినహా మార్పులేవీ చేయలేదు.
ఈ సినిమా అనౌన్స్ చేయగానే క్లాసిక్ సినిమాని టచ్ చేయడమంటే చెడగొట్టడమే అని చాలా కామెంట్స్ వచ్చాయి. ఇటీవల ఫస్ట్ కాపీ చూశాను. తమిళంలో చూసినవాళ్లు తెలుగులో చూసినా సేమ్ ఫీలింగ్ కలుగుతుంది. డబ్బింగ్ చేసినట్టయితే ఆ ఫీల్ వచ్చేది కాదు.
స్క్రిప్ట్ జర్నీలో ఉండే మ్యాజిక్ నచ్చడంతో ఇన్నాళ్లూ రీమేక్స్ జోలికెళ్లలేదు. ప్రేమమ్, బెంగలూరు డేస్ చిత్రాలు చూసి ఎక్సైట్ అయ్యి రీమేక్ చేయాలనుకున్నాను. ‘బెంగలూరు డేస్’ కోసం కొంత వర్క్ చేశాం. కానీ సంతృప్తిగా అనిపించలేదని ఆపేశాం. ‘ప్రేమమ్’ సినిమాను నాగవంశీ నిర్మాస్తాననడంతో నేను డ్రాప్ అయ్యాను.
ఇదే ఏడాది మూడు రీమేక్స్ చేయడం యాదృచ్ఛికం. తమిళం నుండి తెలుగులో ‘జాను’, హిందీ నుండి తెలుగులోకి ‘పింక్’, తెలుగు నుండి హిందీలోకి ‘జెర్సీ’ రీమేక్ చేస్తున్నాను. మూడూ కమర్షియల్ ఫార్మాట్ సినిమాలు కావు.. హార్ట్ టచింగ్ సినిమాలు. సినిమా ఇలాగే ఉండాలి అనే పాత ఈక్వేషన్స్‌ని మెల్లమెల్లగా దాటేశాం. ప్రేక్షకుడికి నచ్చితే సినిమా బాగున్నట్టు.. లేకుంటే బాగోలేనట్టే.
రీమేక్ సినిమాలు చేయకుంటే నాకు ఈరోజు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనే డ్రీమ్ నెరవేరేది కాదు. హిందీలో ఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా లభించేది కాదు. హిందీ నేటివిటీకి తగ్గ మార్పులు ‘జెర్సీ’లో చేశాం. ‘పింక్’ రీమేక్‌కి కూడా చాలా మార్పులు చేశాం. హిందీ, తమిళ వెర్షన్స్ కాకుండా తెలుగులో కొత్త సినిమా చూస్తారు. టైటిల్‌ని ఉగాదికి ప్రకటించి మే 15న సినిమాను విడుదల చేస్తాం. ఇక ఉగాదికి ‘వి’ మూవీ కూడా విడుదల చేయనున్నాం. మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్ సినిమా స్క్రిప్ట్ రెడీ అవుతోంది. మహేష్ గారి నెక్స్ట్ సినిమా ఇదే.
