
ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) ప్రధాన పాత్రలో వస్తున్న 'మామన్నన్(Maamannan)' విడుదలపై నిషేధం విధించాలంటూ నిర్మాత రామశరవణన్(Ramasharavanan) మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉదయనిధి స్టాలిన్ హీరోగా, ఆనంది(Anandi), పాయల్ రాజ్‌పుత్(Payal rajputh) హీరో హీరోయిన్లుగా ఏంజెల్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మాత రామశరవణన్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఎనభై శాతం కంప్లీట్ అయ్యింది. ఇంకో ఇరవై శాతం బ్యాలెన్స్ ఉంది.
ఇక్కడివరకు బాగానే ఉంది కానీ.. తాజాగా హీరో ఉదయనిధి స్టాలిన్ మామన్నన్ ఈవెంట్ లో ఇదే తన చివరి చిత్రం అని ప్రకటించడంతో ఏంజిల్ నిర్మాత కోర్టుకెక్కాడు. ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ.. మామన్నన్ సినిమా విడుదలను ఆపేయాలంటూ పిటీషన్ దాఖలు చేశారు నిర్మాత రామశరవణన్. "నేను.. ఉదయనిధి స్టాలిన్ హీరోగా ఏంజెల్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాను. ఈ సినిమా దాదాపు కంప్లీట్ అయింది. ఇంతలో నా సినిమాను పక్కన పెట్టి మామన్నన్ సినిమాను పూర్తి చేసి విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. అంతేకాదు మామన్నన్ సినిమానే తన చివరి సినిమా అని ప్రకటించారు. ఏంజెల్ చిత్రం కోసం ఇప్పటి వరకు రూ.13 కోట్లు ఖర్చుపెట్టాను. ఈ సినిమా పూర్తి కాకపోతే చాలా నష్టపోతాను. అందుకే మామన్నన్ చిత్రం విడుదలపై నిషేధం విధించి.. తన చిత్రాన్ని పూర్తిచేయాల్సిందిగా ఉదయనిధి స్టాలిన్‌ను ఆదేశించాలని" కోర్టును కోరారు నిర్మాత రామశరవణన్.
ఇక ఈ పిటిషన్ న్యాయమూర్తి కుమరవేల్ బాబు సమక్షంలో విచారణకు వచ్చింది. దీంతో ఈ కేసుపై విచారణ కోరుతూ ఉదయనిధి స్టాలిన్‌కు, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థకు నోటీసులు జారీ చేసి.. జూన్ 28వ తేదీకి విచారణను వాయిదా వేసింది కోర్టు.