TG Vishwa Prasad: రాజాసాబ్ కోసం తెచ్చిన పెట్టుబడులు క్లియర్‌.. త్వరలో వడ్డీ చెల్లిస్తాం.. విడుదలపై నిర్మాత క్లారిటీ

TG Vishwa Prasad: రాజాసాబ్ కోసం తెచ్చిన పెట్టుబడులు క్లియర్‌.. త్వరలో వడ్డీ చెల్లిస్తాం.. విడుదలపై నిర్మాత క్లారిటీ

‘అఖండ 2’ సినిమా విడుదలపై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్ ‘ది రాజా సాబ్’ గురించి కూడా ఒక బ్యాడ్ న్యూస్ ఊపందుకుంది. ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా జనవరి 9న రిలీజ్ అవ్వడం కష్టం అని రూమర్స్ వినిపిస్తున్నాయి. రాజాసాబ్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సైతం ఆర్ధిక సమస్యల్లో కూరుకుపోయిందని, అందువల్ల సినిమా రిలీజ్ ఆగిపోతుందనే వార్త వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే ‘ది రాజా సాబ్’ ఊహాగానాలపైనా క్లారిటీ ఇస్తూ నిర్మాత విశ్వప్రసాద్ పోస్ట్ పెట్టారు. 

నిర్మాత విశ్వప్రసాద్ మాటల్లోనే ‘‘అఖండ 2 సినిమా విడుదల సమస్య నన్ను తీవ్రంగా కలవరపెట్టింది. చివరినిమిషంలో సినిమాలు ఆగిపోవడం దురదృష్టకరం.  ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాలి. ఎందుకంటే.. అది పరిశ్రమలోని వివిధ క్రాఫ్ట్ లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు.. ఇలా ఎంతోమందికి నష్టం కలిగిస్తోంది.

ఈ క్రమంలోనే "రాజాసాబ్" విడుదల చుట్టూ అనేక రూమర్స్ బయటకొస్తున్నాయి. అఖండ 2 సినిమా మాదిరి ఆర్థిక సమస్యలు ఎదురయ్యి రాజాసాబ్ కూడా ఆగిపోతుందని ఊహాగానాలు బలపడుతున్నాయి. వారందరికీ క్లారిటీ ఇస్తున్నాం. రాజాసాబ్ కోసం ఇప్పటివరకు సేకరించిన పెట్టుబడులను మేం క్లియర్‌ చేశాం. ఇందుకు సంబంధించిన వడ్డీని కూడా అతి త్వరలోనే చెల్లిస్తాం. అఖండ 2 గ్రాండ్ రిలీజ్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం’’ అని నిర్మాత విశ్వప్రసాద్ తెలిపారు. 

అలాగే చివరి నిమిషంలో అఖండ 2కి జరిగిన నష్టాన్ని.. ఇక భవిష్యత్తులో ఏ సినిమాకు కూడా రాకూడదని వెల్లడించారు. ఎందుకంటే.. చివరి క్షణంలో సినిమా ఆగిపోతే.. ఆ నష్టం ఎంతోమందికి ఇస్తుందని అన్నారు. అందువల్ల విడుదలకు అంతరాయం కలిగించకుండా స్పష్టమైన చట్టపరమైన మార్గదర్శకాలు రూపొందించడం చాలా ముఖ్యం. ప్రభావిత వాటాదారులు విడుదలను పట్టాలు తప్పేలా చూడకుండా చట్టపరమైన చర్యలను కూడా పరిగణించాలి. తద్వారా భవిష్యత్తుకు భరోసా పుడుతుంది అని విశ్వప్రసాద్ తన నోట్ ద్వారా పేర్కొన్నారు. 
 
‘అఖండ 2’తోపాటు డిసెంబరులో రిలీజ్ కానున్న సినిమాలు, 2026 సంక్రాంతికి రానున్న ‘ది రాజాసాబ్‌’ (జనవరి9), ‘జన నాయకుడు’ (జనవరి 9), ‘మన శంకర వరప్రసాద్‌ గారు’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’(జనవరి 13), ‘అనగనగా ఒక రాజు’(జనవరి 14), ‘నారీ నారీ నడుమ మురారి’, ‘పరాశక్తి’ (జనవరి 14) వంటి తదితర సినిమాల కోసం ఎదురుచూస్తున్నా. ఈ క్రమంలో అన్నీ సినిమాలు సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నా’’ అని విశ్వప్రసాద్ తెలిపారు.