లోకల్​గా స్మార్ట్​ వాచ్​లు, ఇయర్​ ఫోన్స్​ ప్రొడక్షన్ దూసుకుపోతోంది!

లోకల్​గా స్మార్ట్​ వాచ్​లు, ఇయర్​ ఫోన్స్​  ప్రొడక్షన్ దూసుకుపోతోంది!

వేరబుల్స్​, హెడ్​ఫోన్స్​ తయారు చేసే పెద్ద కంపెనీలన్నీ లోకల్​గా తయారీని పెంచుతున్నాయి. చైనా దిగుమతులపై ఆధారపడకుండా ఇక్కడి ప్రొడక్షన్​పై ఫోకస్​ పెడుతున్నాయి. మరోవైపు మొబైల్ ఫోన్ల తయారీకి అన్ని కంపెనీలూ మన దేశంలోనే ప్రొడక్షన్​ ఫెసిలిటీలు పెట్టడం కూడా ఈ వేరబుల్స్​ కంపెనీలకు కలిసి వస్తోంది. ప్రొడక్షన్​ లింక్డ్​ ఇన్సెంటివ్​ (పీఎల్​ఐ) కింద ఆమోదం పొందిన ఆప్టిమస్​ ఎలక్ట్రానిక్స్​ తన నోయిడా ప్లాంట్లో  డజన్ల కొద్దీ మోడల్స్​లో హియరబుల్​, వేరబుల్​ ప్రొడక్ట్స్​ను తయారు చేస్తోంది. గురుగ్రామ్​ కంపెనీ నెక్స్​బేస్​కు నాయిస్​ బ్రాండ్​ పేరుతో ప్రొడక్టులను తయారు చేసి ఆప్టిమస్​ ఇస్తోంది. ఇంటర్నేషనల్​ డేటా కార్పొరేషన్​ (ఐడీసీ) డేటా ప్రకారం 2021 క్యూ3లో ఇండియాలోకి 26 శాతం వేరబుల్స్​ షిప్​మెంట్లు వచ్చాయి. హియరబుల్ కేటగిరీలో ట్రూలీ వైర్​లెస్​ హెడ్​ఫోన్స్​ తయారీ వస్తుంది. వ్యక్తుల చెవిలో ఇమిడిపోయే ఈ వైర్​లెస్​ హెడ్​ఫోన్స్​ బ్లూటూత్​తో పనిచేస్తాయి.

ఉద్యోగాలు పెరుగుతున్నాయి.. 
మా పోర్ట్​ఫోలియోలో ఎక్కువ భాగం ఇండియాలోని ఆప్టిమస్​ ఎలక్ట్రానిక్స్​ ఫెసిలిటీలోనే తయారు చేయించుకోవాలని నిర్ణయించామని నాయిస్​ కో ఫౌండర్​ అమిత్​ ఖత్రి వెల్లడించారు. ట్రైలీ వైర్​లెస్​ హెడ్​ఫోన్ల డిజైన్​ కూడా ఇక్కడే రూపొందించనున్నట్లు చెప్పారు. రాబోయే ఏడాదిలో భారీ పెట్టుబడుల ప్లాన్స్​ను ఈ కంపెనీ వేసుకుంటోంది. 2022లో కొత్తగా 1,000 మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ఆప్టిమస్​ ఎలక్ట్రానిక్స్​ మేనేజింగ్​ డైరెక్టర్​ ఏ గురురాజ్​ వెల్లడించారు. నాయిస్​తోపాటు, మరికొన్ని లోకల్​ బ్రాండ్స్​తోనూ కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏడాది కాలంలో వేరబుల్స్​, హియరబుల్స్​ ప్రొడక్షన్​ కెపాసిటీని డబుల్​ చేయనున్నట్లు తెలిపారు. దేశంలో తన మూడో ఫెసిలిటీని నోయిడా వద్ద ఆప్టిమస్​ ఎలక్ట్రానిక్స్​ ఏర్పాటు చేస్తోంది. ఇది రాబోయే నాలుగైదు నెలల్లో ప్రొడక్షన్​ మొదలు పెడుతుంది.

కరోనా టైమ్‌లో పెరిగిన వాడకం.. 
కరోనా మహమ్మారి రాకతో మన దేశంలో వేరబుల్స్, హియరబుల్స్​ మార్కెట్​ శరవేగంతో దూసుకెళ్తోంది. డిమాండ్​ ఒక్కసారిగా పెరుగుతోంది. వేరబుల్స్​ మార్కెట్​ మన దేశంలో 93.8 శాతం (దాదాపు రెట్టింపు) పెరిగినట్లు ఐడీసి డేటా వెల్లడిస్తోంది. 23.8 మిలియన్​ యూనిట్ల వేరబుల్స్​ మన దేశానికి షిప్​ అయినట్లు పేర్కొంటోంది. బోట్​ వంటి దేశీ బ్రాండు గ్లోబల్​గా టాప్​ 5 బ్రాండ్లలోకి చేరింది. రూ. 3,500 కోట్ల ఐపీఓకి రెడీ అవుతున్న బోట్​ చాలా హియరబుల్​ ప్రొడక్ట్స్​ను మన దేశంలోనే తయారు చేస్తోంది. బెంగళూరులో ఈ ఏడాదే రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​ సెంటర్​నూ ఈ కంపెనీ పెట్టింది. కరోనా మహమ్మారితో ఇక్కడే తయారు చేసే అవకాశం దొరికింది, దీంతో మేకిన్​ ఇండియా బ్రాండ్​ కింద గ్లోబల్​గా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నామని బోట్​ సీఈఓ వివేక్​ గంభీర్​ చెప్పారు. కొన్ని క్వార్టర్ల కిందట మన దేశం వేరబుల్స్, హియరబుల్స్​ కోసం పూర్తిగా దిగుమతుల మీదే ఆధారపడేది. ఈ కొన్ని నెలల్లోనే పరిస్థితులలో మార్పు కనబడుతోందని కౌంటర్​పాయింట్​ రీసెర్చ్​ డైరెక్టర్​ తరుణ్​ పాఠక్​ వెల్లడించారు.