దేశంలోని అగ్రకులాలు ముఖ్యంగా బ్రాహ్మణ, బనియా, కాయస్తా, ఖత్రి, క్షత్రియవంటి అగ్ర కులాలు పూర్తిగా ఉత్పత్తి కులాల వ్యతిరేక స్వభావంతో వందల ఏండ్లుగా వ్యవహరించారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండటం వారికి ఇష్టంలేనట్లు వారి ప్రతి ఉద్యమంలో కనపడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా 1990 మండల్ రిజర్వేషన్ల వరకు తామే లాభపడ్డారు. విద్యా సంస్థలన్నిటినీ తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా అమలు చేయలేదు. ఈ తంతు పార్టీలతో సంబంధం లేకుండా సాగింది. వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నప్పుడు మరీ దారుణంగా కులతత్వం పాటించారు. అసలు దేశంలో కులమే లేదన్నారు.
అటు ఆర్ఎస్ఎస్ దేశంలో కులం లేదన్నట్లే వ్యవహరించింది. ప్రచారం చేసింది. దీని ప్రభావం తెలంగాణ కుల సర్వేలో స్పష్టంగా కనిపించింది. రాష్ట్ర జనాభాలో దాదాపు 3.4 శాతం హైదరాబాద్, రంగారెడ్డి ఇతర పెద్ద పట్టణాల్లో నివసించే ధనవంతులు, పెద్ద పదవులు అనుభవించేవారు ‘నో క్యాస్ట్’ కేటగిరి కింద నమోదు చేసుకున్నారు. వీళ్లు ముస్లింలు కాదు. క్రిస్టియన్లు కాదు. హిందువులు. అందులో వీరు గణనీయ సంఖ్యలో క్యాస్ట్ సర్టిఫికెట్లు తీసుకున్నారు. అది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం కావచ్చు.
ఓబీసీ రిజర్వేషన్ కోసం కావొచ్చు. కులం లేదనే వీరి వారసులే 1990లో మండల్ రిజర్వేషన్‌ను వ్యతిరేకించారు. 2006లో సెంట్రల్ సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్‌ను వ్యతిరేకించారు. ఓబీసీల వల్ల మెరిట్ దెబ్బతింటుందన్నారు. వీళ్లే మంచి సంస్థల్లో చదువుకుని అమెరికా, యూరప్ వెళ్లిపోయారు. వీళ్లే నరేంద్ర మోదీ 2014లో నేను ఓబీసీని బీజేపీని గెలిపిస్తానంటే..ఆయన చాలా గొప్ప నాయకుడని, బ్రహ్మాండమైన తెలివిగలవాడని తమ మీడియాలో, సోషల్‌మీడియాలో పొగిడారు. ఈ ఓబీసీ నాయకుని నేతృత్వంలో దేశం వికసిత్ భారత్‌గా ఎదిగిందని పొగిడారు. ఇప్పుడు కులం పునాదిగా డిస్క్రిమినేషన్ విద్యాసంస్థల్లో జరగకూడదని ఒక చిన్న రిఫామ్ రూల్ రాగానే గందరగోళం చేస్తున్నారు.
బీజేపీ ఈ రూల్స్ ఎందుకు తెచ్చింది?
ఒకప్పుడు ఇటువంటి రూల్స్‌కి, కులగణనకి వ్యతిరేకంగా ఉన్న ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇప్పుడు కులగణన చేయిస్తామని ఎందుకు అంటున్నాయి? యూనివర్సిటీల్లో ఇటువంటి రూల్స్ అవసరమని ఎందుకు అనుకున్నాయి? కాంగ్రెస్ ఇతర సంకీర్ణ ప్రభుత్వాలు ఢిల్లీని పరిపాలించినప్పుడు కూడా యూనివర్సిటీల్లో ఉన్న ద్విజ మేధావులు ఇటువంటి కమిటీలను వేయడానికి వ్యతిరేకించారు. ముందు ఫెమిస్ట్ ఉద్యమాలు వచ్చాక స్త్రీ ప్రొఫెసర్లు జెండర్ డిస్ర్కిమినేట్ కమిటీలు అవసరమని ఉద్యమాలు మొదలుపెట్టారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో అంతా ద్విజ స్త్రీలే కనుక జెండర్ డిస్క్రిమినేషన్ కమిటీలు వేయడానికి లెఫ్ట్–లిబరల్ ద్విజ పురుష ప్రొఫెసర్లు అంగీకరించారు. అధికారులు అంగీకరించారు.
క్రమంగా ఈ వాదన ఎస్సీ, ఎస్టీల నుంచి రాసాగింది. ఎస్సీ, ఎస్టీల డిస్క్రిమినేషన్ సమస్య 2016లో రోహిత్ వేముల మరణంతో ఒక కొత్త మలుపు తిరిగింది. ఇప్పుడు తెలంగాణ, కర్నాటక ప్రభుత్వాలు తెస్తున్న రోహిత్ వేముల చట్టాలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని క్రైసిస్‌లో పడేస్తాయి. ఈ నిబంధనలు తేవడానికి అదొక కారణం. రెండో కారణం.. బీజేపీ అధికారంలోకి వచ్చాక 2019 నుంచి మొత్తం యూనివర్సిటీలను ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న ద్విజులను ఆధిపత్యంలోకి తెచ్చారు. వాళ్లు సనాతన ధర్మం, వేదాలు, రామాయణం, మహాభారతం, కౌటిల్యుని అర్థశాస్త్రం, మను ధర్మశాస్త్రాలను ప్రధానం చేయనారంభించారు.
యూనివర్సిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఈ చర్చల్లో భాగస్వాములవడం లేదు. ఏబీవీపీలో పనిచేసేవారు కూడా బీసీలైతే వారు సనాతన ధర్మంలో భాగస్వాములు కాలేరు. సనాతన ధర్మం అంటేనే వ్యవసాయ రంగ ఆలోచనకు దూరం. గ్రామీణ శూద్ర, దళిత, ఆదివాసీ విద్యార్థులకు సనాతన ధర్మగ్రంథాల్లో ఉనికిలేని చర్చ. పూజ, యుద్ధం, స్త్రీ కుటుంబ ధర్మం అన్నీ పాతకాలం ధర్మాలకు ప్రాధాన్యత ఇచ్చే సిద్ధాంతం అది.
మూడోది.. మొత్తం కేంద్ర సంస్థలలో సంస్కృతం, హిందీలను ప్రధానం చేసి ప్రాచీన పుస్తకాలను చదవాలంటున్నారు. ధోతులు, కుర్తాలు, తలపాగాలు ధరించి డిగ్రీలు తీసుకోవాలంటున్నారు. అది శూద్ర, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఏమాత్రం నచ్చని ఆధునిక వ్యతిరేక పద్ధతులు. తమకు ఇంగ్లిష్ రాకుండా చూస్తున్నారనే అభిప్రాయం వారిలో బలంగా ఏర్పడుతుంది. వీరి ప్రశ్నలను అధికారులు, ద్విజ ప్రొఫెసర్లు, ఆ కులాల విద్యార్థులు శూద్ర, బీసీ, ఎస్సీ, ఎస్టీలు జాతివ్యతిరేకులని అవమానపర్చడం బాగా ఎక్కువైంది. క్లాసుల్లో పాఠాలు చెప్పలేని ఆర్ఎస్ఎస్ భావజాలంతో వచ్చినవారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇంటర్వ్యూలు నామమాత్రమైనాయి. ఈ పద్ధతినే ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ కమ్యూనిస్టులు కూడా పాటించారు. అక్కడ విద్య నాశనమైపోయింది. ఇప్పుడు అన్ని సెంట్రల్ యూనివర్సిటీల్లో పరిస్థితి ఇదే. ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అర్థమైంది.
ప్రధానమంత్రి బీసీ అయినందువల్ల బీసీలకు అవమానం జరగకుండా ఉండటం లేదు. ఇంకా ఎక్కువైంది. బీసీ ప్రధానమంత్రి మా పద్ధతుల్లో మాట్లాడుతూ, మాకు మద్దతుగా ఉండకపోతే ఎలా నడుపుతాడో చూద్దాం అనే స్థితికి ద్విజులు చేరుకున్నారు. కోర్టులు కూడా వీరికే అండగా ఉంటాయనేది మండల్ నుంచి నేటివరకు కనిపిస్తూనే ఉంది.
అడ్మిషన్ల నుంచి అంతటా డిస్క్రిమినేషన్
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు అమలు చేయడానికి చాలాకాలం పట్టింది. ఆ కులాల్లో కింది కోర్సుల నుంచి పై కోర్సులకు పోయేస్థాయిలో వారికేం చదువు వస్తుంది అని ద్విజ కుల మేధావులు అడ్మిషన్లు నిరాకరించడం చాలాకాలం జరిగింది. దక్షిణాదిలో శూద్ర కులాలు ముఖ్యంగా భూమిపై పట్టు సాధించిన శూద్ర కులాలు యూనివర్సిటీల్లోకి వచ్చాక కూడా వారికేం చదువువచ్చు అనే వాదన కొనసాగింది. ఇక ఎస్సీ, ఎస్టీల సంగతి ఏవిధంగా ఉండిందో ఊహించవచ్చు. ఓబీసీ రిజర్వేషన్ మొదలయ్యాక ఆ రిజర్వేషన్లను ముందు దక్షిణాది రాష్ట్రాల్లో కొంత అమలు చేశారు. కానీ, ఉత్తరాది రాష్ట్రాల్లో అటు గుజరాత్, ఇటు బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో అసలు అమలు చేయలేదు. 1990లో మండల్ ఉద్యమం వచ్చాక ఇప్పటిలాగే అగ్ర కుల మీడియా ఉద్యమాలను రెచ్చగొట్టింది. అన్నిరకాల ఉత్పత్తి పనులను అవమానిస్తూ నినాదాలు చేశారు. మా అమ్మాయి రోడ్డు ఊడ్చేవారిని, నాగలి దున్నే కులాలవారిని పెండ్లి చేసుకోవాలా అని అనాడు అరుణ్ శౌరి వంటి మేధావులు పత్రికారంగాన్ని రెచ్చగొట్టింది.
బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన యూజీసీ రూల్స్‌ని ఆ పార్టీలోని మేధావులే వ్యతిరేకిస్తూ మళ్లీ లొల్లి మొదలుపెట్టారు. దేశం మండిపోయినట్లు రోజూ టీవీలు, సోషల్ మీడియా చానళ్లు ఇదేమి అన్యాయం. ఇది అగ్రకులాలపై రివర్స్ డిస్క్రిమినేషన్. కమిటీల్లో ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ ఉంటారంటే మరి అగ్రకులాలు ఏరి అని అరుస్తున్నారు. మిగతావారంతా అగ్ర కులాలవారే ఉంటారని వీరందరికి తెలుసు. ఒక ఉమెన్ మెంబర్ కూడా ఆ కులాల నుంచే ఉంటారు. ఇది మాట్లాడరు. పదిమంది ప్లకార్డులు పట్టుకొని నిలబడినా వందలమంది ఉన్నట్టు యూజీసీ రూల్స్ వ్యతిరేక ఉద్యమాల్లో చూపెడుతున్నారు. కానీ, వందలాది మంది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పాల్గొని ఉద్యమాలు నడిపితే అసలు వారిది ఒక్క ఫొటో కూడా కనిపించదు. మూడు రోజుల్లోనే ఈ యూజీసీ గైడ్‌లైన్స్ సుప్రీంకోర్టుకు వెళ్లి ఆపించే పద్ధతిలో అలజడి చేశాయి మీడియాలు. ఇది మండల్ వ్యతిరేక ఉద్యమానికంటే అతి భయంకరంగా దేశం ముందుంచారు.
ఇప్పుడు మార్గమేంది?
ఈ ఉద్యమాలన్నిటిలో ద్విజ ఆధిపత్యానికి శూద్ర అగ్రకులాలు, జాట్లు, పటేళ్లు, మరాఠాలు వంటి కులాలు సహకరిస్తున్నాయి. నిజానికి సెంట్రల్ సంస్థల్లో వీళ్ల పిల్లలకు కూడా ఆదరణ లేదు. అలా ఉన్నట్లయితే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సర్వీసులో ద్విజుల కంటే రెడ్డి, కమ్మ, మరాఠా, జాట్వంటి కులాల నుంచి వచ్చినవారే ఎక్కువగా ఉండేవారు. కానీ, ఈ నాటికీ వారు దేశ పరిపాలనలో పెద్దగా లేరు. కేవలం రాష్ట్రాల్లో మాత్రమే వీరు కనిపిస్తారు. కానీ, దేశాన్ని నడిపేది, పెద్ద ఇండస్ట్రీ, పై బ్యూరోక్రసీ ఇంకా ద్విజుల చేతుల్లోనే ఎందుకు ఉన్నది?
వీరి పిల్లలు అసలు చదువుకోవడం లేదా? కాదు. వాళ్లు ప్రయత్నిస్తున్నారు. కానీ, సనాతన ధర్మ సిద్ధాంతంలో శూద్రులుగా వీరంతా అణచివేతకు, డిస్క్రిమినేషన్‌కు గురవుతున్నారు. కానీ, వారికి శూద్ర చైతన్యం లేక తాము ద్విజులతో సమానమైపోయినట్లు భావించి ఇటువంటి ఉద్యమాల్లో వారికే సహకరిస్తున్నారు. వీరు రాష్ట్రాలలో పెత్తనంతో సంతృప్తిపడ్డంత వరకు దేశస్థాయిలో స్థితి మారదు. ఇది అసలు సమస్య.
- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
