బీఆర్‌ఎస్​ను బొంద పెట్టాలె  :  కోదండరాం

బీఆర్‌ఎస్​ను బొంద పెట్టాలె  :  కోదండరాం

మహబూబాబాద్ అర్బన్​, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బొంద పెట్టాలని టీజేఎస్  అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. నిరుద్యోగులందరూ ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని ఆయన కోరారు.​ బుధవారం ఇల్లందు బైపాస్​లో కాంగ్రెస్​ అభ్యర్థి డాక్టర్​ మురళీ నాయక్​ను కోదండరాం సన్మానించారు. అనంతరం మహబూబాబాద్​లోని గంగపుత్ర భవన్​లో మీడియా సమావేశంలో మాట్లాడారు.

బీఆర్ఎస్  దుష్ట పాలన నుంచి విముక్తి కలిగితేనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. ప్రజల సొమ్ము రూ.100 కోట్లతో సీఎం కేసీఆర్  విమానాలు కొన్నారని, ఆయన కూతురు కవిత వద్ద రూ.50 లక్షల బంగారు హారం ఉందని, ఈ డబ్బు ఇక్కడి నుండి వచ్చిందని కోదండరాం ప్రశ్నించారు. ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించాలన్నారు. కేసీఆర్ ను రెండు సార్లు సీఎంగా చేసినా మన బతుకులు మారలేదన్నారు. బూటకపు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రూ.లక్షల కోట్ల ప్రజాధనం వృధా చేశారని మండిపడ్డారు.

ప్రజలు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు పోకుండా పోలీసు బందోబస్తు పెట్టిన కేసీఆర్​ను తరమికొట్టాలన్నారు. ఇక ధరణి మొత్తం కేసీఆర్ చేతిలో ఉందని, గ్రూప్స్  పరీక్షలు లీకేజీతో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. ఉద్యోగం రాక ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే, ప్రేమ వ్యవహారమంటూ కేసును తప్పుదోవ పట్టించారని ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోదండరాం కోరారు. ఈ సమావేశంలోకాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర నాయకురాలు, మున్సిపల్  చైర్​పర్సన్​ భూక్య ఉమ, టీజేఎస్​ లీడర్లు డోలి సత్యనారాయణ, మైస శ్రీనివాస్, గుంజె హన్మంతు, పాషా తదితరులు పాల్గొన్నారు.  

కేసీఆర్ కు నిరుద్యోగుల పాపం తగులుతుంది

కురవి, వెలుగు : నిరుద్యోగులు, అమరుల కుటుంబాల పాపం సీఎం కేసీఆర్ కు తగులుతుందని కోదండరాం అన్నారు. బుధవారం సాయంత్రం కురవి వీరభద్రస్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉద్యమ సమయంలో రాష్ట్రం ఏర్పాటు కోసం అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, ఎందరో కేసుల పాలై జైలు జీవితం అనుభవించారన్నారు. అలాంటి వారి త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణ కేసీఆర్ చేతిలో అవినీతి అక్రమాలకు నిలయంగా మారిందని మండిపడ్డారు. ప్రజలు కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పి కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు.