త్యాగం అమరవీరులది.. భోగం కేసీఆర్ కుటుంబానిది: ప్రొ. కోదండరామ్

త్యాగం అమరవీరులది..  భోగం కేసీఆర్ కుటుంబానిది: ప్రొ. కోదండరామ్

బీఆర్ఎస్  పాలనలో ప్రజా ప్రతినిధులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజా ధనాన్ని కొల్లగొడుతున్నారని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. దేశంలో కేసీఆర్ లాంటి అరాచక పాలన ఎక్కడా లేదని ఆయన విమర్శించారు.  ప్రజల భూమిని 50 లక్షలకు కొనుగోలు చేసిన బీఆర్ఎస్ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని 8 కోట్లకు అమ్ముకుంటున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అడ్డగోలుగా దోచుకున్నారని విమర్శించారు. మిషన్ భగీరథ పథకంలో.. పాలను పిండినట్లు పేద ప్రజల పైసలు పిండుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమర వీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం భోగం అనుభవిస్తుందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 

ఇవి కూడా చదవండి: తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన కొనసాగుతోంది..

తెలంగాణ సమాఖ్య ఆధ్వర్వంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారంటూ.. వైద్యం, ఉపాధి అంశాలపైనా చర్చ జరిగింది. కాంట్రాక్టుల కోసం తెంగాణ అమరవీరులు పోట్లాడలేదని..  తెలంగాణ ప్రజల కష్టాలు తీరాలంటే మరో బృహత్తర ఉద్యమం జరగాలని కోదండరాం అన్నారు. తెలంగాణలో చిన్న రైతు బతుకు కష్టంగా మారిందని .. బీఆర్ఎస్ నేతల దురాగతాలు ఎక్కువయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రజా సమస్యలను లేవనెత్తే వారిపై ప్రభుత్వం కక్ష పూరితంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. అధికార పార్టీ  దోపిడీ చేస్తుంటే కనీసం నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షాలకు లేకుండా సీఎం కేసీఆర్ అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.  దశాబ్ధి ఉత్సవాల సభలను ఎన్నికల సభలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ పెద్దలదేనని ఆయన అన్నారు.  ప్రభుత్వ తప్పులను తెలియపరుస్తున్న మీడియాను కట్టడం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.