తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన కొనసాగుతోంది.. : రాణి రుద్రమ దేవి

తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన కొనసాగుతోంది.. : రాణి రుద్రమ దేవి

రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ మండి పడ్డారు. తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన కొనసాగుతోందని విమర్శించారు. హనుమకొండ జిల్లాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ పరిస్థితులు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన నిరంకుశ వైఖరికి నిదర్శనంగా నిలిచాయని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి: కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్  ప్రతినెల పాకెట్ మనీ ఇస్తుండు : బండి సంజయ్ 

అప్పటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన ఏకైక పార్టీ బీజేపీ నేని అన్నారు. కాంగ్రెస్ విధానాలు నచ్చకే తదుపరి ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించారని తెలిపారు. ఇండియా అంటేనే ఇందిరా అన్నట్లుగా ఉండాలని ఇందిరాగాంధీ భావించారని ఆరోపించారు. తెలంగాణ కోసం బీజేపీ నుంచి సుష్మాస్వరాజ్ లాంటి ఎందరో నేతలు పోరాడారని గుర్తు చేశారు. బీఆర్ఎస్, బీజేపీకి లోపాయికారి ఒప్పందం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రశ్నించే వారిని ఇబ్బందులు పెడుతూ.. అరెస్టులు చేయడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుందని విమర్శించారు. 

మంత్రి కేటీఆర్ అబద్ధాలు చెబుతున్నారు..

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 9 ఏళ్లలో కేవలం రూ.1.60 లక్షల కోట్లే ఇచ్చిందని మంత్రి కేటీఆర్ అబద్ధాలు చెబుతున్నారని రాణి రుద్రమ అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.4 లక్షల కోట్లకు పైనే నిధులిచ్చినట్లు స్పష్టం చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిర్మిస్తామంటే ప్రభుత్వం  స్థలం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని అన్నారు. స్మార్ట్ సిటీ పనుల కింద కేంద్రం ఇచ్చిన రూ.196 కోట్లను ప్రభుత్వం ఏం చేసిందో తెలపాలని డిమాండ్ చేశారు. వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.కోట్లు కేటాయించగా వాటన్నింటినీ తెలంగాణ సర్కార్ పక్క దారి పట్టించిందని ఆరోపించారు.