జేఎన్​యూపై కావాలనే విష ప్రచారం : ప్రొఫెసర్ హరగోపాల్

జేఎన్​యూపై కావాలనే విష ప్రచారం : ప్రొఫెసర్ హరగోపాల్
  • ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన
  • కీపింగ్ ఆఫ్ ద గుడ్ ఫైట్’ పుస్తకావిష్కరణ

ముషీరాబాద్, వెలుగు : దేశానికే తలమానికంగా నిలుస్తూ.. సమగ్ర చర్చలకు నిలయమైన జేఎన్ యూపై కావాలనే విష ప్రచారం చేస్తున్నారని  ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. అధిపతులకు తెలియకుండానే ఒక భావజాలానికి చెందిన 80 మందిని ఫ్యాకల్టీగా నియమించడాన్ని తప్పుపట్టారు. తమ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న ప్రోగ్రెసివ్​ ప్రొఫెసర్లపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రబీర్ పుర్కయస్థ  రాసిన ‘ కీపింగ్ ఆఫ్ ది గుడ్ ఫైట్ ఫ్రమ్​ ద ఎమర్జెన్సీ టు ద ప్రెజెంట్ డే’ పుస్తకావిష్కరణ కార్యక్రమం మంగళవారం రాత్రి బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది.

గెస్ట్ లుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్​ మాడభూషి శ్రీధర్, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, సీనియర్ జర్నలిస్టు తులసిచందు హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అయోధ్యలో రాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట వెనక ఏండ్ల ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిందని, ఇది అర్థం చేసుకోకపోతే నిజం మాత్రమే తెలుసుకుంటారని, సత్యాన్ని తెలుసుకోలేరని..  అందుకే సత్యాన్వేషణ జరగాలని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగం అన్ని మతాలు, కులాలు ప్రజలను సమానంగా గౌరవిస్తుందన్నారు.

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రగతి నిరోధక శక్తులు అధికారంలోకి వస్తే దేశం ఎలా ఉంటుందో ఆనాడే బీఆర్ అంబేద్కర్ హెచ్చరించారని ప్రొఫెసర్ హరగోపాల్ గుర్తు చేశారు. ఎమర్జెన్సీ కాలంలోనూ ఇంత దుర్మార్గమైన పరిస్థితి లేదన్నారు. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉండాలని, ప్రశ్నించే వారికి అండగా ప్రజలు నిడబడాలని సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ కోరారు. జర్నలిస్టు నిరంతరం 
ప్రశ్నించాలని, పరిశోధించాలని సూచించారు.

అన్యాయాన్ని ఎదిరించేవాడు ఆరాధ్యుడు అన్న కాళోజీ మాటలను గుర్తు చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ పైనే కాదు అన్ని వ్యవస్థలపైన దాడి జరుగుతుందని ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ అన్నారు. ఆలోచనల ఆధిపత్యాన్ని ప్రశ్నించాలని, హక్కుల ఉల్లంఘన లేని సమాజ నిర్మాణం కోసం ముందుకు రావాలని యువతకు పిలుపునిచ్చారు. దేశంలో విద్యార్థి రాజకీయాలు దేశానికి ఎంతో అవసరమని సమాజానికి ఉపయోగపడుతుందని సీనియర్ జర్నలిస్టు తులసి చందు అభిప్రాయపడ్డారు.