రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే మన మనుగడకే ప్రమాదం : హరగోపాల్​

రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే మన మనుగడకే ప్రమాదం : హరగోపాల్​

ఖైరతాబాద్, వెలుగు: కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే.. రాజ్యాంగ రక్షణ ఉద్యమాలు చేయాల్సి వస్తుందని ప్రొఫెసర్​హరగోపాల్ అన్నారు. ప్రస్తుతం దేశ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేందుకు మనువాద బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.  రాజ్యాంగాన్ని మార్చితే మధ్యయుగాల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటేనే మన మనుగడ సాధ్యమని స్పష్టం చేశారు. 

తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ‘భారత రాజ్యాంగం –హక్కులు– రిజర్వేషన్లు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు వక్తలు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా హరగోపాల్​మాట్లాడుతూ.. దేశంలో సంపదను వృద్ధి చేసే విధానం తేవాలని.. సామాజిక న్యాయం లేని ఆర్థికాభివృద్ధి ఎందుకని ప్రశ్నించారు.   బీజేపీది విభజించు, పాలించు సిద్ధాంతం: సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి బీజేపీది విభజించు పాలించు సిద్ధాంతమని సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి అన్నారు. 

సంక్షోభంలో ప్రజాస్వామ్యం : కాశీం

దేశంలో ఇయ్యాల ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉందని ప్రొఫెసర్​ కాశీం ఆందోళన వ్యక్తంచేశారు.  దేశంలో అసమ్మతి లేకపోతే నియంతృత్వం వైపు వెళ్తుందని అన్నారు. రిజర్వేషన్లను ఎత్తేసే దమ్ము, ధైర్యం బీజేపీకి లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​ గౌడ్ అన్నారు. కేంద్రంలో ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి ప్రధానిగా ఉండి బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా లేకపోవడం సిగ్గుచేటన్నారు. 

ప్రజలే నిర్ణయించాలి : జస్టిస్ ​చంద్రకుమార్

రాజ్యాంగాన్ని మార్చుతారని కాంగ్రెస్.. మార్పుచేయమని బీజేపీ అంటున్నాయని, ఇందులో ఎవరిది కరెక్టనేది ప్రజలే నిర్ణయించాలని జస్టిస్​చంద్రకుమార్​అన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో జర్నలిస్టుల అధ్యయన వేదిక ప్రధాన కార్యదర్శి సాదిక్, ట్రెజరర్ సురేశ్, సీనియర్ జర్నలిస్టు జయసారథిరెడ్డి, కాంగ్రెస్ నేత సంగిశెట్టి దశరథ్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, చిన్న శ్రీశైలం యాదవ్​ తదితరులు హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.