ఎల్బీనగర్, వెలుగు: శ్రీకాంతాచారి ఆత్మబలిదానం కారణంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శ్రీకాంతాచారి 16వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఎల్బీనగర్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఆకాంక్షను శ్రీకాంతాచారి ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.
ఒకవైపు ప్రాణం పోతున్నా జై తెలంగాణ అంటూ నినాదాలు చేసిన గొప్ప ఉద్యమ వీరుడని కొనియాడారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని, ప్రస్తుత ప్రజాప్రభుత్వంలోనే అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పల్లె వినయ్ కుమార్, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
