యుద్ధాన్ని వెంటనే ఆపేయాలి : జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం

యుద్ధాన్ని వెంటనే ఆపేయాలి : జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
  •     ఈ నెల 29న యుద్ధ వ్యతిరేక ర్యాలీని సక్సెస్ చేయండి 
  •     ప్రజలకు ప్రొఫెసర్ కోదండరాం పిలుపు
  •     చార్మినార్ నుంచి నాంపల్లి వరకు కొనసాగనున్న ర్యాలీ

హైదరాబాద్, వెలుగు: ఇరాన్‌‌‌‌పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపివేయాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విజ్ఞప్తి చేశారు. మంగళవారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల జన సమితి ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. 

చమురు వనరులపై అమెరికా ఆధిపత్యం సాధించాలనే లక్ష్యంతో జరుగుతున్న ఈ యుద్ధాన్ని ప్రతిఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.  యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సరైన విధానాన్ని అవలంబించడంలో విఫలమైందన్నారు. ఈ యుద్ధం కారణంగా మన దేశంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడుతుందనే ఆందోళన ప్రజల్లో నెలకొందని పేర్కొన్నారు.  గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న కోటి మంది భారతీయులు, అందులో 15 లక్షల మంది తెలంగాణవాసులు తీవ్ర భయాందోళనల మధ్య జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో యుద్ధ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 29న ఉదయం 10:30 గంటలకు చార్మినార్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ర్యాలీలో ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.  

రైతులకు నష్టపరిహారం ఇవ్వండి..

ఫార్మా సిటీ, గ్రీన్ ఫీల్డ్ హైవే భూ బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రొఫెసర్ కోదండరాం అధికారులను కోరారు. ఈ మేరకు మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌‌‌‌ నారాయణరెడ్డితో ఆయన సమావేశమయ్యారు. గత ప్రభుత్వంలో జరిగిన బలవంతపు భూసేకరణ వల్ల నష్టపోయిన రైతులకు తగిన న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫార్మా సిటీ భూసేకరణ జరిగిన కుర్మిద్ద, తాటిపర్తి, నానక్‌‌‌‌నగర్, మేడిపల్లి గ్రామాలను సందర్శించి రైతులతో సమావేశమై వారి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.