
బషీర్బాగ్: రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే సుప్రీం రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా గెలిపించుకోవాలని తెలంగాణ జన సమితి చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్, విద్యా కమిషన్ మెంబర్ విశ్వేశ్వరయ్య, సీనియర్ ఎడిటర్లు రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. రాజ్యాంగ విలువల రక్షణకు జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఇందుకు తెలుగు రాష్ట్రాల ఎంపీలు కృషి చేయాలన్నారు. సీఎం రేవంత్రెడ్డి సిఫార్సు చేశారని బీఆర్ఎస్ ఓటు వేయబోమని చెప్పడం సరికాదన్నారు. ఆయన ఇండియా కూటమి అభ్యర్థి అని గ్రహించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన పాత్ర కూడా ఉందనే విషయాన్ని గుర్తుచేశారు. సుదర్శన్ రెడ్డి గెలుపునకు 82 ఓట్లు మాత్రమే తక్కువగా ఉన్నాయని, బీఆర్ఎస్, టీడీపీ, జనసేన, వైఎస్సార్ సీపీ ఎంపీలు సహకరిస్తే గెలుపు సాధ్యమని అన్నారు.
ప్రమాదంలో రాజ్యాంగం..
పద్మారావునగర్ : ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడుతున్నాయని ఉమ్మడి ఏపీ హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిపై కేంద్ర మంత్రి అమిత్షా అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం సికింద్రాబాద్ బోయిగూడలోని నాలెడ్జ్ సెంటర్‌లో తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ బన్నూరు కొండారెడ్డి అధ్యక్షతన లాయర్ల రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది.
ఈ సందర్భంగా మాజీ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని బ్రష్టుపట్టించడానికి బీజేపీ అనైతిక చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్, ఏపీసీఎల్సీ నేత సురేశ్, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా ప్రొఫెసర్ వాగేశ్, గోవర్ధన్, సీనియర్ అడ్వకేట్ ప్రసాద్ బాబు, బీవీ శేషగిరి, డాక్టర్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.