రెండు సార్లు ఊరికొచ్చి మాటిచ్చి మర్చిపోయిండు

రెండు సార్లు ఊరికొచ్చి మాటిచ్చి మర్చిపోయిండు
  •  అంకాపూర్​, ఎర్రవెల్లి చేస్తానన్న కేసీఆర్
  •  రెండుమాట్ల ఊరికొచ్చి మాటిచ్చిండు  

2020  నవంబర్​ 1

‘అంకాపూర్, ఎర్రవెల్లి తరహాలో వాసాలమర్రిని డెవలప్​చేస్తా. రూ.100 కోట్లు చాలకపోతే,  ఎన్ని కోట్ల రూపాయలైన సరే ఖర్చు చేయిస్తా. అందరికీ ఉపాధి కల్పిస్తా. భూమి ఇస్తా. డబుల్​ బెడ్​రూం ఇండ్లు కట్టిస్తా. ప్రభుత్వ సాయం అందని మనిషి వాసాలమర్రిలో ఉండొద్దు. ఊరు బాగుండాలే. వ్యవసాయం బాగుండాలే. ఊరి ప్రజల జీవన స్థితిగతులనే మార్చేస్తా. మీతో కలిసి భోజనం చేస్తా’

2021 జూన్​ 22న

‘ మీకు మీరే డెవలప్​కావాలే. అందరూ కలిసికట్టుగా పని చేసుకోవాలే. కేసీఆర్ మీ చేతుల్లో ఉన్నడు. మీ వెనుక ప్రభుత్వం ఉన్నది. ఊరును బంగారు వాసాలమర్రిగా చేసుకోవాలె. ఇంటికో బర్రెను ఇస్తాం. అవసరమైన వారికి ట్రాక్టర్లు కూడా ఇస్తం’

2021 ఆగస్టు 4న

‘వాసాలమర్రిలో ఇండ్లు సక్కదనంగ లేవు. అన్ని మట్టిగోడల ఇండ్లే. కొన్ని కూలిపోయినయి. ఊరంతా ఎత్తులు..ఒంపులు ఉన్నయ్. వానపడితే నీళ్లు ఇండ్లళ్లకు వస్తున్నయ్. మీరందరూ ఒప్పుకుంటే ఎర్రవెల్లి లెక్క ఊరు మొత్తం కూలగొడ్దాం. అందరికీ ఒకే రీతిగ ఇండ్లు కట్టేదాక టెంట్ల కిందే ఉందాం. మీరు ఒప్పుకుంటే ఆరేడు నెలల్లో బ్రహ్మాండంగా చేసుకుందాం. అలాగే గత ప్రభుత్వాల వల్ల దళిత సమాజానికి పూర్తిగా స్కీమ్స్, వాటి ఫలాలు అందలేదు. భూమి లేని దళితులు ఎంతమంది అనేది పరిశీలిస్తున్నం. దళితబంధు కింద రూ. 10 లక్షల చొప్పున ఇస్తాం. ఆక్రమణలకు గురైన దళితుల భూములను రికవరీ చేస్తాం. ఒక్కో కుటుంబానికి ఒకటి, రెండు ఎకరాలను అందించేందుకు ప్లాన్​ చేస్తాం.  15 రోజుల్లో ప్రక్రియ ప్రారంభిస్తాం.  

యాదాద్రి, వెలుగు :  పైన చెప్పిన మాటలన్నీ సీఎం కేసీఆర్​ తన దత్తత గ్రామమైన యాదాద్రి జిల్లా వాసాలమర్రికి ఇచ్చిన హామీలకు సంబంధించినవి. 2020 నవంబర్​ నుంచి 2021 ఆగస్టు వరకు గ్రామానికి రెండు సార్లు వచ్చిన సీఎం ఊరిని అద్భుతంగా మారుస్తానని ప్రకటించారు. ఆయన మాట్లాడిన ప్రతిసారి జనాలు ఉప్పొంగిపోయారు. చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. కాలం గడిచిపోతోంది కానీ, ఇప్పటివరకు గొప్పగా చేసిందేమీ లేదు. సీఎం ఫస్ట్​ టైం వచ్చినప్పుడు ఊరు ఎట్లున్నదో ఇప్పుడూ అట్లే ఉన్నది. జిల్లా ఆఫీసర్లు రెండుసార్లు సర్వే చేసినా..ఎలాంటి ఫలితం లేదు. ఇచ్చిందల్లా బీడీ కార్మికులకు పింఛన్లు, కొందరికి రేషన్​ కార్డులు మాత్రమే. ఇప్పుడు వాసాలమర్రిలో అవే ఇరుకురోడ్లు, అవే పెంకుటిండ్లు ఉన్నయ్​. 

ఫామ్​హౌస్​కు పోతుండగా..


2020 అక్టోబర్​ 31న జనగామ జిల్లా కొడకండ్ల నుంచి ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్​కు వెళ్తూ. వాసాలమర్రిలో ఆగారు సీఎం కేసీఆర్. అక్కడి స్థానికులతో కొద్దిసేపు మాట్లాడారు. ఆ మరుసటి రోజే గ్రామ పాలకవర్గాన్ని పిలిపించుకొని వాసాలమర్రిని తాను దత్తత తీసుకుంటున్నానని చెప్పారు. ఏడు నెలల తర్వాత ఊరికి వచ్చి ఎన్ని కోట్లయినా సరే ఊరిని అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. వాసాలమర్రికి స్పెషలాఫీసర్​గా డీఆర్​డీఓ పీడీ ఉపేందర్​రెడ్డిని వేసి నెల రోజుల్లో ఇంటింటి సర్వే నిర్వహించారు. డిపార్ట్​మెంట్ల వారీగా జిల్లా ఆఫీసర్లు రంగంలోకి దిగి గ్రామంలో ఉన్న ఇండ్లు, వయసుల వారీగా జనాభా, రైతులు, రైతు కూలీలు, ఉపాధి, కుల, మతాలకు సంబంధించిన వివరాలు సేకరించారు. ప్రజలు ఏమడిగారో రిపోర్ట్​లో పేర్కొన్న ఆఫీసర్లు వాటిని సమకూర్చడానికి ఎంత ఖర్చువుతుందో కూడా తేల్చారు. డిజిటల్ రిపోర్ట్ రెడీ చేసి అప్పటి కలెక్టర్ అనితా రామచంద్రన్​కు నెలలోపే అందజేశారు. గ్రామస్థులను రెండుసార్లు నిజామాబాద్​లోని అంకాపూర్​కు తీసుకెళ్లారు. యశోద హాస్పిటల్​ ఆధ్వర్యంలో హెల్త్​క్యాంప్​ ఏర్పాటు చేశారు. టెస్టులు చేసి 1157 మంది వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్నారని హెల్త్​ ప్రొఫైల్ కూడా​క్రియేట్​ చేశారు.  తాజాగా బుధవారం సీఎంఓ సెక్రెటరీ స్మితా సబర్వాల్​, ఇతర శాఖల హయ్యర్​అఫీషియల్స్​ వచ్చి మీటింగ్​ పెట్టారు. అందరూ కలిసి ఉండి ఊరిని బాగు చేసుకుంటామని తీర్మానం చేసి పంపిస్తే మోడల్​విలేజ్​గా మారుస్తామన్నారు.రెండోసారి సర్వే 2020లో సర్వే చేసినా ఏడు నెలల తర్వాత మళ్లీ చేయాలనడంతో 2021లో జిల్లా ఆఫీసర్లు మళ్లీ  సర్వే చేసి, డీపీఆర్​ రూపొందించి..డిజిటల్​గా పంపించారు. చిన్న ఊరే కాబట్టి. రెండు సర్వేల్లో సమస్యలు ఓకేతీరుగా ఉన్నాయని  తెలిపారు. 

డీపీఆర్​లో ఉన్నది

‘గ్రామంలో ఎక్కువగా పెంకుటిండ్లే ఉన్నాయి కాబట్టి  అందరికీ డబుల్ ​బెడ్​రూమ్​  ​ఇండ్లు కట్టించి ఇవ్వాలి. స్థలం తక్కువగా ఉన్నందున..కొందరి ఇండ్ల స్థలాలను తగ్గించి మరికొందరికి ఇండ్లు కట్టించాలి. రైతుల కంటే రైతు కూలీలే ఎక్కువగా ఉన్నందున భూములివ్వాలి. పని లేక తిరుగుతున్న యూత్ ఎక్కువగా ఉన్నందున వారికి ట్రాక్టర్లు, హర్వేస్టర్లు, ఆటోలు, పాడి పశువులు ఇవ్వాలి. గ్రామంలో రోడ్లు ఇరుకుగా ఉన్నాయి. కొన్ని ఇండ్లను తొలగించి రోడ్లు పెద్దగా చేయడంతో పాటు సీసీ రోడ్లు వేయాలి. గ్రామం నుంచి కొండాపూర్​తో పాటు మరో మూడు గ్రామాలకు రోడ్డేయాలి. చెరువులను పునరుద్ధరించి, టూరిస్ట్ సెంటర్లుగా డెవలప్ చేయాలి.  గ్రామంలోకి కోతులు రాకుండా అటవీ ప్రాంతానికి చుట్టూరా కంచె వేయాలి. సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. హెల్త్​క్యాంప్​ పెట్టి హెల్త్​రిపోర్ట్​ తయారు చేయాలి’ అని డీపీఆర్​లలో పేర్కొన్నారు.  

అనుకున్నది జరగలే...

గ్రామాన్ని సీఎం దత్తత తీసుకుని ఊరికి వచ్చి హామీ ఇచ్చారు కాబట్టి తొందర్లోనే అనుకున్నట్టవుతుందని గ్రామస్తులు భావించారు. చింతమడకలో ప్రతి ఇంటికి రూ. 10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఇచ్చారని, డీసీఎంలు,  ట్రాక్టర్లు, జేసీబీ, వరికోత మెషీన్లు కొనుక్కున్నారని, డెయిరీలు, కోళ్ల ఫారాలు కట్టుకున్నారని, తమ ఊరు అలా మారుతుందనుకున్నారు. అయితే ఊరిని దత్తత తీసుకొని 15 నెలలు కావస్తోంది. ఇప్పుడే సబ్‌స్టేషన్​ కడుతున్నరు. బీడీ కార్మికులకు పింఛన్లు, మరికొందరికి రేషన్​కార్డులిచ్చారు. అంతకుమించి కొత్తగా వచ్చిన మార్పేమీ లేదు. ఆరేడు నెలల్లో కొత్త ఇండ్లు కట్టుకుందామని చెప్పగా పెంకుటిండ్లు దర్శనమిస్తున్నాయి. ఇరుకురోడ్లు, ఎత్తు ఒంపుల తొవ్వలు వెక్కిరిస్తున్నాయి. బర్రెలు, ట్రాక్టర్ల ముచ్చట ముందుకు పోలే. ఎవరికీ ఉపాధి కల్పించలే. దత్తత తీసుకున్నది సీఎం కదా..ఆయన మాట నెరవేర్చకపోతారా అని జనాలు ఎదురుచూస్తానే ఉన్నరు.