- 90 శాతం పూర్తయిన ప్రాజెక్టుల పనులు కొనసాగించండి
హైదరాబాద్, వెలుగు: వరికి ప్రత్యామ్నాయంగా నూనె, పప్పు ధాన్యాలు, ఉద్యానవన పంటలు సాగు చేసేలా రాష్ట్ర రైతులను ప్రభుత్వం ప్రొత్సహించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి కోరారు. వరి సాగు భారీగా పెరుగుతూ, దిగుబడి రికార్డ్ స్థాయిలో వస్తుందని, ఈ నేపథ్యంలో వరి కొనుగోళ్లు పెద్ద సమస్యగా మారాయన్నారు. రైతులను ప్రత్యామ్నాయ పంటలపై మళ్లించి, ప్రొత్సహించాలని మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో ఆయన విజ్ఞప్తి చేశారు.
అలాగే, రాష్ట్రంలో 90 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టుల పనులు కొనసాగించాలని, మిగతా వాటి పనులు ఆపాలని సూచించారు. 2006 లో రూ.8 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణం.. ఇప్పుడు చేపడితే భారీగా వ్యయం అవుతుందన్నారు. దీంతో ఆ ప్రాజెక్టును నిలిపివేసి, కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులను చేపట్టి తిరిగి పనిచేసేలా చేయాలని ఆయన కోరారు.
