
కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఒక వ్యక్తి బ్యాంకులో లోన్ కోసం ఆస్తులను తాకట్టు పెడితే, ఆ ఆస్తులు నేరం చేసి సంపాదించిన డబ్బుతో కొన్నవి కాకపోతే, వాటిని మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేయలేరని తెలిపింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పులో ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
నేరం చేసి సంపాదించిన డబ్బుతో కొన్న ఆస్తులను మాత్రమే జప్తు చేయాలని, లోన్ కోసం షూరిటీగా బ్యాంకులో తాకట్టు పెట్టిన ఆస్తులను జప్తు చేయకూడదని కోర్టు చెప్పింది. కర్ణాటక రాష్ట్రం మండ్యలోని సిండికేట్ బ్యాంకులో అవకతవకలు జరిగాయని, బ్యాంక్ అధికారులు కొంతమందికి అక్రమంగా రుణాలు ఇచ్చి బ్యాంకుకి సుమారు రూ. 12 కోట్ల నష్టం కలిగించారని సీబీఐ కేసు నమోదు చేసింది.
దీని ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ PMLA కింద కేసు పెట్టి, నిందితులకు చెందిన కొన్ని ఆస్తులను జప్తు చేయాలని 2012లో ఆదేశాలు ఇచ్చింది. జప్తు చేయాలనుకున్న ఏడు ఆస్తులు నిందితులలో ఒకరు అతని బంధువులకు చెందినవి కాగా, అవి అప్పటికే బ్యాంకు తాకట్టులో ఉన్నాయి.
►ALSO READ | మంటల్లో కాలుతూనే భార్య, కూతురిని కాపాడాడు.. అగ్నిప్రమాదంలో కాంగ్రెస్ సీనియర్ నేత మృతి
సిండికేట్ బ్యాంకు ఈ కుట్రలో భాగమని చెప్పలేమని, లోన్ తీసుకోవడం కోసం బ్యాంకులో తాకట్టు పెట్టిన ఆస్తులు నేరం నుండి వచ్చినవి కానప్పుడు, వాటిని జప్తు చేసే అధికారం చట్టబద్ధం కాదని కోర్టు తెలిపింది.
ఈ వ్యవహారంలో ED జోక్యం చేసుకుంటే, SARFAESI చట్టం (సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్) కింద కోర్టు జోక్యం లేకుండా ఆస్తిని స్వాధీనం చేసుకునే బ్యాంకు హక్కు దెబ్బతింటుందని, అలాగే బ్యాంకుకి ఇబ్బంది కలుగుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఈ కారణాల వల్ల హైకోర్టు ED అప్పీలును కొట్టేసింది.