ఆస్తి లొల్లి.. మృతదేహంతో ఆందోళన..ఇంటి ఆవరణలో పూడ్చేందుకు యత్నం.. జగిత్యాల జిల్లాలో ఘటన

ఆస్తి లొల్లి.. మృతదేహంతో ఆందోళన..ఇంటి ఆవరణలో పూడ్చేందుకు యత్నం.. జగిత్యాల జిల్లాలో ఘటన
  • తల్లిదండ్రులను కోల్పోయిన బాలుడికి అన్యాయం చేస్తున్నారని ఆరోపణ

జగిత్యాల టౌన్, వెలుగు: తల్లిని కోల్పోయి అనాథగా మారిన చిన్నారికి ఆస్తి పంపకాల్లో అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ.. చిన్నారి తరఫు బంధువులు మహిళ  డెడ్​బాడీని ఇంటి ఆవరణలో పూడ్చేందుకు యత్నించారు. ఈ ఘటనలో జగిత్యాల పట్టణంలోని వంజరివాడలో ఉద్రిక్తత నెలకొంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వంజరివాడకు చెందిన మాధురి(35) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతిచెందింది. ఆమె భర్త మూడేళ్ల క్రితమే మృతిచెందాడు. వీరికి ఒక కొడుకు రాజ్​(13) ఉన్నాడు.

భర్త చనిపోగానే మాధురి అత్త తమ ఆస్తిని బిడ్డలకు మాత్రమే ఇస్తానని చెప్పింది. ఈ విషయంలో తన కొడుకు పరిస్థితి ఏం కావాలని మాధురి మనస్తాపంతో ఉంటోంది. ఈ క్రమంలో ఆమె చనిపోవడంతో.. వారి తరఫు బంధువులు ఇంటికి చేరుకుని అత్త తీరుతోనే మాధురి చనిపోయిందని ఆరోపించారు. 

వారసత్వంగా ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఒత్తిడికి గురిచేశారని వాపోయారు. తల్లిదండ్రులను కోల్పోయిన బాలుడు రాజ్​కు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధురి డెడ్​బాడీని ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టేందుకు బొంద తవ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేశారు. ఆస్తి వివాదాన్ని న్యాయపరంగా పరిష్కరించుకోవాలని సూచించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.