ఆర్థిక నేరగాళ్లకు కోడ్..ఆధార్, పాన్ ఆధారంగా కేటాయింపు

ఆర్థిక నేరగాళ్లకు కోడ్..ఆధార్, పాన్ ఆధారంగా కేటాయింపు

న్యూఢిల్లీ: ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలపై,  వ్యక్తులపై త్వరగా చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక కోడ్​ విధానాన్ని తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం నిందితులకు పాన్ లేదా ఆధార్‌‌తో "ప్రత్యేక కోడ్" కేటాయించే కొత్త విధానాన్ని తేవాలన్న ప్రపోజల్​ను  పరిశీలిస్తోంది. ఈ విధానంలో ఆల్ఫా-న్యూమరిక్ కోడ్ ను కంప్యూటర్​ ద్వారా -జెనరేట్ చేసి పోలీసు యూనిట్ లేదా కేంద్ర దర్యాప్తు సంస్థకు పంపిస్తారు. నిందితులకు సంబంధించిన డేటాను నేషనల్ ఎకనామిక్ అఫెన్స్ రికార్డ్స్ (ఎన్​ఈఓఆర్​)లో ఫీడ్ చేసిన తర్వాతే నంబర్లు జారీ అవుతాయి.

ఇందుకు సంబంధించిన సెంట్రల్​ రిపాజిటరీ ఇంకా పూర్తిగా పని చేయడం లేదు. ఈ విధానం వల్ల  ఏజెన్సీలు ఆర్థిక నేరాలను వేగంగా దర్యాప్తు చేయడానికి, చార్జిషీట్ దాఖలు చేయడానికి వీలవుతుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలు లేదా వ్యక్తులపై బహుళ-ఏజెన్సీల దర్యాప్తును వేగంగా ప్రారంభించవచ్చు. ఈ కోడ్​ను 'యూనిక్ ఎకనామిక్ అఫెండర్ కోడ్'గా పిలుస్తారు. నిందితుడు ఒక వ్యక్తి అయితే ఆధార్‌‌తో,  కంపెనీ అయితే పాన్​కార్డుకు లింక్ అవుతుందని సమాచారం. ఈ విధానం అమల్లోకి వస్తే .. ఇది వరకే వివిధ ఆర్థిక నేరాల్లో చిక్కుకున్న వాళ్లకు ప్రత్యేక కోడ్​ ఇస్తారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా, లిక్కర్​బారన్​ విజయ్​ మాల్యా, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం వంటి వాళ్లకు ఈ విధానం వర్తిస్తుందని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. ఎన్​ఈఓఆర్​ ఇలాంటి వాళ్ల డేటాను స్టోర్​ చేస్తుంది. రాబోయే నాలుగైదు నెలల్లో ఇది పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వరలో జరిగే ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్​ఫోర్స్​ (ఎఫ్​ఏటీఎఫ్​) సమావేశంలో దీనిని ప్రదర్శిస్తారని సమాచారం.