ములుగు/గోవిందరావుపేట/ఆత్మకూరు/శాయంపేట, వెలుగు : నీటి వృథాతో మానవ మనుగడే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని మంత్రి సీతక్క హెచ్చరించారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని సూచించారు. ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం పస్రా గ్రామంలో ఆదివారం నిర్వహించిన జల మహోత్సవ ర్యాలీ, అడవుల సంరక్షణ – ఆవశ్యకత అవగాహన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... భూగర్భజలాలను పెంచేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. అడవుల సంరక్షణతోనే సుస్థిర భవిష్యత్‌కు బలమైన పునాది పడుతుందని, స్వచ్ఛమైన ప్రాణవాయువుకు అడవులే మూలాధారమని, అడవుల సంరక్షణ బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు.
అనంతరం కలెక్టర్ దివాకర టీఎస్, డీఎఫ్‌వో రాహుల్‌కిషన్ జాదవ్‌తో కలిసి పస్రాలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ములుగు మండలం ఇంచర్ల గట్టమ్మ వద్ద పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్నర్యంలో నిర్మిస్తున్న టూరిజం విలేజ్ పనులను పరిశీలించారు. పనుల్లో క్వాలిటీ ఉండేలా చూసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పాల్గొన్నారు.
అనంతరం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం తిరుమలగిరిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ... ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైందన్నారు. మొక్కలను విరివిగా నాటాలని లేకపోతే భవిష్యత్‌లో గాలిని కొనుక్కోవాల్సి వస్తోందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, పరకాల ఆర్డీవో డాక్టర్ కన్నం నారాయణ, మిషన్ భగీరథ ఈఈ గాయత్రి, తహసీల్దార్ జగన్మోహన్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ దేవేంద్ర పాల్గొన్నారు.
