ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు.

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు.
  • గ్రామ కమిటీలు కీలకంగా పని చేయాలి -విద్యుత్​ శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి

నల్గొండ అర్బన్/ సూర్యాపేట, వెలుగు: ‘బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్​రెడ్డి అన్నారు. శనివారం నల్గొండ టౌన్​లోని లక్ష్మి గార్డెన్ లో బాలల హక్కుల రక్షణ చట్టాలపై  బాలల పరిరక్షణ  కమిటీల చైర్​పర్సన్​లకు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాన్ని మంత్రి  ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన వారితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశానికే రోల్​మోడల్​గా ఉందని, బాలల హక్కుల రక్షణలో కూడా ముందుండేలా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు.

దేశంలో ఫారెన్​ కల్చర్​ప్రవేశం వల్ల  కుటుంబాలు విడిపోయి బాలలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇంకా పట్టణాల్లో పిల్లలను యాచక వృత్తిలో దింపుతుండడం, ఆడపిల్లల అక్రమ రవాణా చేస్తుండడం బాధాకరమన్నారు.  బాలల హక్కుల పరిరక్షణ లో సర్పంచ్​ల ఆధ్వర్యంలోని గ్రామ కమిటీ లు కీలక పాత్ర పోషించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్​ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి,  కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరి, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మెంబర్​పి.అంజన్ రావు, ఆర్డీవో జగన్నాథరావు, జడ్పీ సీఈవో ప్రేమ్​కరణ్​రెడ్డి, డీఈవో భిక్షపతి, వుమెన్ అండ్​చైల్డ్​వెల్ఫేర్ ఆఫీసర్లు​సుభద్ర, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. 

వృద్దులే మన ఆస్తి 

వృద్దులే మన ఆస్తి అని, వారిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని  మంత్రి  జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా శనివారం సూర్యాపేటలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  తల్లిదండ్రులు తమ పిల్లలను ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని పెంచి పెద్ద చేస్తారన్నారు. కానీ చాలా మంది అది మరిచి  తల్లిదండ్రులను ఆదరించకుండా ఆశ్రమాలలో చేర్చుతున్నారని వాపోయారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యంలో ఉండే తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.  జిల్లా సంక్షేమ శాఖ ఆఫీసర్​జ్యోతి పద్మ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో  సూర్యాపేట మున్సిపల్ చైర్​పర్సన్​ అన్నపూర్ణ, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

డాక్టర్ల సేవలు వెలకట్టలేనివి

మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జి. చంద్రయ్య

నల్గొండ అర్బన్​, వెలుగు : డాక్టర్ల సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్య అన్నారు. శనివారం ఆయన జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని విజిట్​చేశారు.  ఎమర్జెన్సీ వార్డు, ఐసీయూలో చికిత్స పొందుతున్న సనా , శంకర్​అనే పేషెంట్లతో మాట్లాడి..‘ డాక్టర్లు బాగా చికిత్స అందిస్తున్నారా? సరిగా  మందులు ఇస్తున్నారా?’ అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం  సూపరింటెండెంట్‌చాంబర్‌లో డాక్టర్లతో  మాట్లాడుతూ విద్య, వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేస్తే మిగతా అన్ని రంగాలు కుంటుపడుతాయని, వైద్యసేవలు పక్కాగా అందించాలని డాక్టర్లకు సూచించారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రెండు రంగాలపై ఫోకస్​పెట్టాయని జస్టిస్​చంద్రయ్య చెప్పారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు తమకు కంప్లైంట్​చేస్తే వారి హక్కులను పరిరక్షిస్తామన్నారు.  డీఎంహెచ్​వో డాక్టర్‌  కొండల్‌రావు, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ మాతృ, ఆస్పత్రి సూపరింటెండెంట్‌డాక్టర్‌ లచ్చూ తదితరులు పాల్గొన్నారు. 

మునుగోడులో ప్రజాధనం దుర్వినియోగం

యాదాద్రి, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల కారణంగా ప్రజాధనం దుర్వినియోగమవుతోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో జరిగిన పార్టీ మీటింగ్​లో  ఆయన మాట్లాడారు. ఫిరాయింపులను బీజేపీ ప్రోత్సహిస్తోందని, వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని చెరుపల్లి ఆరోపించారు.  ఎవరికి అవసరం లేని ఎన్నికలు తీసుకొచ్చిన బీజేపీని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. మీటింగ్​లో కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, మంగ నరసింహులు, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. 

పార్టీలకు అతీతంగా  అభివృద్ధి చేయాలి

ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి

హుజూర్ నగర్/ మేళ్లచెర్వు(చింతలపాలెం), వెలుగు: పార్టీలతో సంబంధం లేకుండా  పల్లెలను అభివృద్ధి చేయాలని నల్లగొండ  ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం హుజూర్ నగర్ మండల పరిషత్​సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్​అన్నీ  సర్పంచ్​లకు, ఎంపీటీసీలకు అందించి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. రైతు రుణమాఫీ అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. లిఫ్టు ఇరిగేషన్ల నిర్వహణ  ప్రభుత్వమే చూస్తుందని సీఎం కేసీఆర్​చెప్పారని, ఫండ్స్​లేక లిఫ్టు లు ఆగిపోవడంతో వేల ఎకరాల పంటలు ఎండి పోయాయని ఉత్తమ్​వాపోయారు.  జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి,  ఎంపీపీ గూడెపు శ్రీను , మండల పరిషత్​సభ్యులు పాల్గొన్నారు.  

ఫారెస్ట్​ భూములు కబ్జా చేస్తున్రు..

హుజూర్‌నగర్ లోని ఫారెస్ట్​భూములు కబ్జా చేస్తున్నారని, అధికార పార్టీ లీడర్లే అక్రమార్కులకు సహకరిస్తున్నారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి మేళ్లచెరువు మండలంలో శనివారం ఆయన పర్యటించారు.  ఈ సందర్భంగా చింతలపాలెం మండల కేంద్రంలో ఉత్తమ్ రైతులతో సమావేశం​నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్​లీడర్లకు సొంత విమానాలు,హెలికాప్టర్లు కొనేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలకు చెప్పాలన్నారు. ఎంపీపీ సైదేశ్వర్ రావు, పార్టీ లీడర్లు కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వృద్ధులను వేధిస్తే కఠిన చర్యలు

యాదాద్రి, వెలుగు: వృద్ధుల సంరక్షణకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, వారిని  ఎవరు వేధించినా.. కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్​పమేలా సత్పతి హెచ్చరించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో  గెలుపొందిన వారికి కలెక్టర్​ బహుమతులు అందించారు. అనంతరం మాట్లాడుతూ ప్రత్యేక ట్రిబ్యునల్స్ ద్వారా వయోవృద్ధుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రతిఒక్కరూ వృద్ధుల పట్ల ప్రేమతో, బాధ్యతాయుతంగా,  గౌరవంగా మెలగాలని  జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. వృద్ధులకు ఎలాంటి సమస్యలు వచ్చినా  వెంటనే  టోల్ ఫ్రీ నెంబర్ 14567 కు ఫోన్ చేయాలని తెలిపారు. అడిషనల్​ కలెక్టర్​ దీపక్​ తివారి, సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం నాయకులు పోలి శంకర్ రెడ్డి,  అంజయ్య తదితరులు ఉన్నారు.

ఫ్యాక్టరీ ఏర్పాటు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం.. వాడపల్లి– ఇర్కిగూడెం గ్రామ శివార్లలో ‘కృష్ణా గోదావరి పవర్ యుటిలిటీస్​ లిమిటెడ్’​ పేరుతో కెమికల్​ ఫ్యాక్టరీ ఏర్పాటు నిర్ణయాన్ని  వెనక్కి తీసుకోవాలని మున్సిపల్​ ప్లోర్​లీడర్​ బత్తుల లక్ష్మారెడ్డి  డిమాండ్​చేశారు.  శనివారం ప్లాంట్​ ప్రాంతాన్ని స్థానిక కాంగ్రెస్​ లీడర్లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సదరు కంపెనీ గవర్నమెంట్​ రూల్స్​ పాటించకుండా   గ్రామానికి  దగ్గరలో నిర్మించడం దుర్మార్గమన్నారు. ఎల్​వీ సత్యనారాయణ, దామరచర్ల సర్పంచ్ బంటు కిరణ్, నేతలు భాషా నాయక్ పాల్గొన్నారు.  

విద్యుత్ షాక్​తో వ్యక్తి మృతి

తుంగతుర్తి, వెలుగు: మండల పరిధిలోని తూర్పుగూడెం గ్రామంలో విద్యుత్ షాక్​తో ఓ వ్యక్తి  చనిపోయాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుండగాని పరుశురాములు (55)  తన వ్యవసాయ పొలంలో విద్యుత్ మోటార్​ఆన్​చేస్తుండగా..  ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్​కు గురై స్పాట్​లోనే చనిపోయాడు. మృతుడికి భార్య,  ముగ్గురు పిల్లలు ఉన్నారు.  భార్య ఉపేంద్ర కంప్లైంట్ మేరకు కేసు ఫైల్​చేసి  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డానియల్ తెలిపారు. 

అర్హత లేకుండా వైద్యం చేయడం నేరం

నేరేడుచర్ల/గరిడేపల్లి, వెలుగు:  ఆస్పత్రుల యాజమాన్యాలు అర్హతలేని వారితో వైద్యం చేయించడం చట్టరీత్యా నేరమని జిల్లా ఆస్పత్రుల తనిఖీ బృంధం అధికారి కల్యాణ్​చక్రవర్తి అన్నారు. శనివారం నేరేడుచర్ల, గరిడేపల్లి మండలాల్లోని పలు ప్రైవేట్ ఆస్పత్రులలో  డాక్టర్ల బృందం తనిఖీలు నిర్వహించింది. నేరేడుచర్ల టౌన్​లో ఆర్ఎంపీలు నడుపుతున్న వెంకట శివ, కోటయ్య, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను, అర్హత లేని వెంకటేశ్వర, సౌలత్​లు లేని స్నేహ ల్యాబ్​లను డాక్టర్లు సీజ్​చేశారు. వెంకటేశ్వర, సాయి శ్రీనివాస హాస్పిటల్స్​కు నోటీసులు అందించినట్లు తెలిపారు. నేరేడుచర్ల  పీహెచ్​సీ వైద్యాధికారి నాగయ్య, ప్రత్యేక అధికారులు సైదులు,  మధుబాబు, అంజయ్య, జగదీశ్​ తదితరులు ఉన్నారు.

గరిడేపల్లిలో..
గరిడేపల్లి లో ఆర్ఎంపీలు నడుపుతున్న శివ సాయి, కార్తికేయ, శ్రీనివాస ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను వైద్యాధికారులు  సీజ్ చేశారు. తనిఖీ బృందాలను చూసి చాలా వరకు ఫస్ట్​ఎయిడ్​సెంటర్ల నిర్వాహకులు తాళాలు వేసుకుని వెళ్లారు.  

ఆడబిడ్డలకు పండుగ సారె.. నేతన్నలకు ఉపాధి

యాదగిరిగుట్ట, వెలుగు: బతుకమ్మ చీరల పంపిణీతో తెలంగాణ ఆడబిడ్డలకు పండుగ సారె తో పాటు చేనేత కార్మికులకు ఉపాధి లభించిందని వ్యవసాయ శాఖ మంత్రి సి. నిరంజన్ రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా మోటకొండూర్ లో శనివారం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతతో కలిసి ఆయన బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏటా రూ.300 కోట్లు బతుకమ్మ చీరల కోసం కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, ఎంపీపీ ఇందిర,  జడ్పీటీసీ పల్లా వెంకట్ రెడ్డి, సర్పంచ్ శ్రీలత పాల్గొన్నారు. 

గెలిపిస్తే అభివృద్ధి చేస్తా..

కాంగ్రెస్ పార్టీ​ అభ్యర్థి పాల్వాయి స్రవంతి

చండూరు,( మర్రిగూడ) వెలుగు: ఉప ఎన్నికల్లో  తనను గెలిపిస్తే  నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తానని కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు. శనివారం మర్రిగూడ మండలం అంతంపేటలో పార్టీ కార్యకర్తలతో  కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. మహిళా ఓటర్లకు బొట్టుపెట్టి   చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. టీఆర్ఎస్​ ప్రభుత్వం మునుగోడు ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు.  ఎన్నికల ముందు మోసపూరిత హామీలు ఇచ్చి అనంతరం మరిచిపోతారన్నారు. నమ్మి గెలిపించుకున్న రాజ గోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరారన్నారు.  దండు యాదగిరి రెడ్డి, గూడెపు యాదయ్య, భీమనపల్లి సైదులు, కూర బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

పవర్​ప్లాంట్​ పనులను పరిశీలించిన సీఎండీలు

మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా దామరచర్ల మండల పరిధిలోని వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్​ పవర్​ ప్లాంట్​ను శనివారం కేంద్ర​( పీఎఫ్​సీ) విద్యుత్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ  రవీందర్ సింగ్, కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్థ(ఆర్ఈసీ) సీఎండీ వివేక్ కుమార్ దేవంగన్ విజిట్​చేశారు. ‘యాదాద్రి’ ప్లాంట్​లో రూ.  29 వేల కోట్ల వ్యయంతో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఐదు యూనిట్లను ఏర్పాటు చేస్తుండగా టీఎస్ జెన్ కో ప్రధాన పనులను బీహెచ్ఈఎల్ కు అప్పగించింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బేధాభిప్రాయాలతో ఫండ్స్​రిలీజ్​ఆగిపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు.  ఈ నేపథ్యంలో సీఎండీలు పర్యటించి పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం టీఎస్​ జెన్​కో, బీహెచ్ఈఎల్,ఆఫీసర్లతో పనుల పురోగతిపై రివ్యూ చేశారు. టీఎస్​ జెన్​కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్​రావు, డైరెక్టర్​ అజయ్, సీఈ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.  

అనుమానాస్పద స్థితిలో బాలుడి మృతి

రాజాపేట, వెలుగు: మండలంలోని కొండారెడ్డి చెరువు గ్రామంలో ఓ బాలుడు శనివారం   అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. గ్రామస్తులు, ఎస్సై శ్రీనివాస్​రెడ్డి వివరాల ప్రకారం..  గ్రామానికి చెందిన దంపతులు కర్రె ఎల్లేశ్, భాగ్యలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఉమేశ్​(12)   ఆరో తరగతి చదువుతున్నాడు.  శనివారం  మధ్యాహ్నం బాలుడు పశువులు మేపేందుకని కంచలోకి  వెళ్లాడు. బాలుడు వెళ్లిన అరగంటకు తల్లి వెళ్లి చూస్తే అక్కడ బాలుడు కనిపించలేదు. వెతకగా తల్లికి అటుపక్కగా బాలుడు చెట్టుకు వేలాడుతూ  కనిపించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రాజపేట ఎస్సై శ్రీనివాస్ రెడ్డి కేసు ఫైల్​చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు

దేవరకొండ(చింతపల్లి),వెలుగు: చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద శుక్రవారం  రాత్రి జరిగిన రోడ్డు యాక్సిడెంట్​లో గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని  ఎస్సై రమేశ్​ చెప్పారు. స్థానికులు, పోలీసులు దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారని, తలకు బలమైన గాయమవ్వడంతో  కోమాలోకి వెళ్లాడని తెలిపారు. చికిత్స పొందుతున్న వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్సై  కోరారు.

అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్

యాదాద్రి, వెలుగు: తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగలను శనివారం యాదాద్రి జిల్లా భువనగిరి టౌన్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ సత్యనారాయణ వివరాల ప్రకారం.. టౌన్​లోని రాంనగర్​లో గత నెల 4న గూడూరు భాస్కర్​రెడ్డి ఇంటికి తాళం వేసి ఉండడంతో దొంగలు పడ్డారు. బంగారు చైన్​, వెండి కడియాలతో పాటు వెండి గిన్నె, రూ.10 వేలు దోచుకెళ్లారు.

ఊరు నుంచి వచ్చిన భాస్కర్​రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  కాగా భువనగిరి శివారులో శనివారం వెహికల్స్​చెకింగ్​లో అనుమానాస్పదంగా కన్పించిన మనిగండ్ల విజయ్ ​కుమార్, అమృతం రాజేశ్​, బుంగ మహేశ్ను  ప్రశ్నించగా దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి 7 తులాల బంగారం, 8 తులాల వెండి , ఇండికా కారు, 4సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విజయ్​ కుమార్​పై ఏపీలోని జగ్గయ్య పేట, తెలంగాణలోని పలు జిల్లాల్లో కేసులు నమోదైనట్లు సీఐ తెలిపారు.   రాకేశ్​అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు. 

‘స్వచ్ఛ సర్వేక్షన్’  అవార్డు అందుకున్న చైర్మన్ జయబాబు

నేరేడుచర్ల, వెలుగు:  మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షన్ జాతీయ అవార్డుకు ఎంపికైన నేపథ్యంలో శనివారం ఢిల్లీలో  మున్సిపల్ చైర్మన్ చందమళ్ల జయబాబు, కమిషనర్​ వెంకటేశ్వర్లు అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హాజరు కాగా, కేంద్ర మంత్రులు కౌశల్ కిషోర్ , మనోజ్  జోష్​ అవార్డులు అందజేశారు.

చౌటుప్పల్​ ఆర్డీవో బదిలీ

యాదాద్రి, వెలుగు: చౌటుప్పల్​ ఆర్డీవో ఎస్. సూరజ్​కుమార్​బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మెదక్​ జిల్లా నర్సాపూర్​ ఆర్డీవో కె. వెంకట ఉపేందర్​రెడ్డి రానున్నారు. ఈ మేరకు శనివారం సీఎస్​  సోమేశ్​ కుమార్​ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్డీవో సూరజ్​కుమార్​కు స్పెషల్​ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్​గా గత నెలలోనే ప్రమోషన్​ వచ్చింది. మునుగోడు బైఎలక్షన్ నేపథ్యంలోనే బదిలీ చేశారని తెలుస్తుంది.​ అయితే ఆయనకు పోస్టింగ్​ ఎక్కడా ఇవ్వకుండా  సీఎస్​కు రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. చౌటుప్పల్​కు వస్తున్న కొత్త ఆర్డీవో వెంకట ఉపేందర్​రెడ్డిది ఉమ్మడి నల్లగొండ జిల్లా నకిరేకల్ కావడం గమనార్హం.

ఉచిత కరెంట్ ఘనత 

టీఆర్ఎస్​ ప్రభుత్వానిదే

మునుగోడు, వెలుగు: దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఉచిత కరెంటు అందిస్తున్న ఘనత  టీఆర్ఎస్ ​ప్రభుత్వానిదే అని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాలలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుల ఆత్మీయ పలకరింపు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  రైతు పండించిన పంట కొనేందుకు 7  వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు  చేశామని 7,500 కోట్ల తో రైతుబంధు రైతులకు ఇస్తున్నామని ఆయన అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్​ పార్టీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పలివెల, ఇప్పర్తి గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు రాజేశ్వర్​రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు. 

బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లు పక్కాగా చేయాలి

నల్గొండ అర్బన్​, వెలుగు: నల్గొండ పట్టణంలోని వల్లభరావు చెరువు వద్ద  బతుకమ్మలు నిమజ్జనం చేసేందుకు  ఏర్పాట్లు పక్కాగా చేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి,  కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం వారు  నిమజ్జన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. విద్యుత్ శాఖ అధికారులు  స్తంభాలు, వైర్లు నిమజ్జనానికి అడ్డంగా ఎంటే వెంటనే తొలగించాలని, మున్సిపల్ శాఖ లైటింగ్, శానిటేషన్​ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జగన్నాథ రావు పాల్గొన్నారు. 

పత్తి కొనుగోళ్లకు సీసీఐ  సిద్ధం

నల్గొండ అర్బన్​, వెలుగు : పత్తి కి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు సీసీఐ సిద్ధంగా ఉందని  అడిషనల్ ​కలెక్టర్​ భాస్కర్ రావు తెలిపారు. శనివారం కలెక్టరేట్​లోని తన చాంబర్ లో పత్తి కొనుగోళ్ల పై సీసీఐ, మార్కెటింగ్​, అగ్రికల్చర్​, తూనికల, జిన్నింగ్ మిల్లుల యజమానులతో  అడిషనల్​ కలెక్టర్​ మీటింగ్ ​నిర్వహించారు. జిల్లాలో 6 లక్షల 41 వేల302 ఎకరాల్లో పత్తి సాగు చేశారని, 51 లక్షల 64 వేల 757 క్విటాళ్ల పత్తి  దిగుబడి రానుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారని తెలిపారు.   అక్టోబర్ 15 నుంచి పత్తి కొనుగోలుకు అధికారులు సిద్ధంగా ఉండాలని భాస్కర్​రావు ఆదేశించారు.  మార్కెటింగ్ ​ఆఫీసర్​ శ్రీకాంత్,  వ్యవసాయ శాఖ అధికారిణి సుచరిత,  తూనికలు, కొలతలు శాఖ  ఇన్​స్పెక్టర్​ రామకృష్ణ  
తదితరులు పాల్గొన్నారు.