దేశంలో 'అగ్నిపథ్' మంటలు చెలరేగాయి. త్రివిధ దళాల్లో సైనిక నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'అగ్నిపథ్' పథకంపై దేశంలో పలు చోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. నాలుగేళ్ల సర్వీస్ అంటూ కేంద్ర ప్రభుత్వం తమ జీవితాలను నాశనం చేస్తోందని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆందోళన కార్యక్రమాలు హింసాత్మక రూపు దాలుస్తున్నాయి. పలు చోట్లు ఆందోళనకారులు రైళ్లకు నిప్పు పెట్టారు. ఇప్పుడు అగ్నిపథ్ మంటలు తెలంగాణను సైతం తాకాయి. బస్సులపై ఆర్మీ అభ్యర్థులు రాళ్లు రువ్వారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో రైలు బోగీలకు నిప్పంటించారు. మొదటి మూడు ఫ్లాట్‌ఫాంలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ మూడు ఫ్లాట్‌ఫాంలను పూర్తిగా ధ్వంసం చేశారు. హౌరా ఎక్స్‌ప్రెస్, ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ సహా మూడు రైళ్లకు ఆందోళనకారులు నిప్పంటించారు. మొత్తానికి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రణరంగంగా మారింది.
అంతే కాకుండా రాళ్లు, కర్రలు, రాడ్లతో... ఇలా ఏది దొరికితే వాటితో దాడులు చేస్తూ ఆందోళనకారులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. దాడులు చేస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంతాలను అట్టుడుడికిస్తున్నారు. ఎంతో మంది పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. ఏం చేయలేని స్థితిలో పోలీసు యంత్రాంగం ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఆందోళన కారులను చెదరగొట్టేదుకు పోలీసుల బాష్పవాయువు ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఇవాళ ఉదయం ప్రారంభమైన ఈ ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో సికింద్రాబాద్ అధికారులు రైళ్లన్నింటినీ నిలిపివేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.
బీహార్, హర్యానాలో అగ్నిపథ్ నిరసనలు..
మరోవైపు బీహార్, హర్యానాలో నిరసనలు హింసాత్మకమయ్యాయి. రైలు, రోడ్డు మార్గాలను ఆందోళనకారులు బ్లాక్ చేశారు. బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. రైల్వే ట్రాక్‌లపై పడుకుని నిరసనలు తెలిపారు. కొన్ని చోట్ల రైల్వే స్టేషన్లలో ఫర్నిచర్‌కు నిప్పు పెట్టారు. బీహార్‌లో ఓ రైలు అద్దాలను పగులగొట్టి చేసి, బోగీకి నిప్పుపెట్టారు. ఎమ్మెల్యే కారును అడ్డగించి దాడి చేశారు. చాలా చోట్ల పోలీసులపై రాళ్లు రువ్వారు. హర్యానాలో అల్లరి మూకను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. బుధవారం బీహార్‌లో మొదలైన నిరసనలు మెల్లగా దేశమంతటా పాకుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. అగ్నిపథ్ విషయంలో ఉన్న అపోహలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అగ్నివీర్ సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగాల భర్తీలో ప్రాధాన్యం ఇస్తామని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రకటించారు. మరోవైపు ‘ఇండియన్ ఆర్మీ లవర్స్’ అని రాసి ఉన్న బ్యానర్ పట్టుకున్న యువకులు.. కొత్త రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
